అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 18వ అధ్యాయము - 73వ శ్లోకము ।।
అర్జునుడు పల్కెను: చంచలబుద్ధిలేని, అచలపరిపూర్ణభావజ్ఞుడవైన ఓ శ్రీకృష్ణా! నీ కృపచే నా యొక్క మోహమనే చలన స్వభావము నిర్మూలించబడినది. అనగా నా అజ్ఞానమునకు మూలకారణమైన పదార్థము హరించివేయబడినది. ఇంతవరకు ధర్మశాస్త్రములయందు నిర్ణయించబడియున్న కర్మసన్యాసము, కర్మఫలత్యాగము అను పద్ధతులు ప్రయోజనహీనములు. కాని నీ యొక్క ప్రబోధముచే నీ యొక్క నిర్ణయపద్ధతులగు కర్తృత్వత్యాగము అనగా కర్తయేలేని విధానము, క్షరాక్షరపురుష స్పర్శలేని ఉత్తమపురుష పద్ధతియగు అస్పర్శయోగము యొక్క పద్ధతి తెలియబడి నా యొక్క పూర్ణ నిజస్వరూపమును గ్రహించితిని. అందువల్ల చ్యుతిలేని స్థితుడనై చంచలబుద్ధిని మాని ఉన్నాను. అనగా మళ్ళీ నీచయోనులలోకి జారుట లేదు, ఏ విధమైన జన్మలలోకి వెళ్ళేది లేదు. నాకున్న సందేహములన్నియు తొలగిపోయినవి. కనుక నీ ఉపదేశము ప్రకారము ప్రవర్తింతును. - డా. రాపెల్లి శ్రీధర్, న్యూయార్క్