విగ్రహారాధన

చమత్కార/హాస్య వ్యాసాలు, పరిశోధనాత్మక/సందేశాత్మ/విమర్శాత్మక వ్యాసాలు .... అన్ని రకాల తెలుగు వ్యాస రచనలు - మీ స్వీయ రచనలు లేదా మీ అభిమాన వ్యాసరచయిత వ్యాసాలు (మీ వ్యాఖ్యానంతో), వాటి మీద చర్చలూ!

విగ్రహారాధన

Postby Dr.Rapelli_Sridhar » Thu Sep 26, 2013 11:47 pm

విగ్రహారాధన

మనిషి తాను తయారు చేసిన ఒక రాతిశిల్పమునో, లోహమూర్తినో, మట్టిప్రతిమనో, కట్టెబొమ్మనో ముందు పెట్టుకొని దానిని దేవుడిగానో, దేవతగానో, దేవుని ఆత్మ ఆవహించిన దివ్యావతారముగానో భావించి షోడశోపచారములను చేస్తూ మతసంబంధమైన భక్తితో పూజించడమే విగ్రహారాధన.

పూజించుటయనగానేమి? పూజించుటయనగా గౌరవించుట, సత్కరించుట, ఆరాధించుట. ఒక భక్తిభావముతో శ్లోకపద్యాదులను పాడుచూ పెద్దలనో, గురువులనో, దేవతాప్రతిమలనో, పుణ్యతీర్థములనో, దేవాలయములనో గౌరవభావముతో సత్కరించుటయే పూజ లేక ఆరాధన. పూజ అనునది ప్రతిమ యొక్క వాస్తవికతను స్పష్టము చేస్తుంది. ప్రతిమ దేనికైతే చిహ్నమో దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. పూజను ఏ ఒక్క వ్యక్తియో లేక వ్యక్తుల సమూహమో ఒక పూజారి సమక్షములోనో, స్వతంత్రముగానో నిర్వహిస్తూ వుంటారు. ఈ పూజలను దేవాలయములలోనో లేక తమతమ గృహములందో లేక బహిరంగ ప్రదేశములందో చేస్తూ వుంటారు. వివిధ మతసంప్రదాయకులు వివిధ రకములుగా పూజా సమయాలను నిర్దేశిస్తూ వుంటారు. కొందరు ప్రతిరోజు నిర్దేశిత సమయమందు చేస్తుండగా, మరికొందరు కొన్ని ప్రత్యేకమైన తిథివారనక్షత్రములననుసరించి ఆయా దేవతలకు పూజాదికములను చేస్తూ వుంటారు.

పూజలలో అనేక రకముల భావవ్యక్తీకరణలు ఉంటాయి. పూజలందు క్రింది వాటిలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలు ఉంటాయి: ప్రార్థన, ధ్యానము, షోడశోపచారములు, మతపరమైన పాపవిమోచన క్రియలు, ప్రసాద వితరణ, అన్నదానము, షోడశదానములు, ఉపవాసము, జపము, వ్రతము, సంగీతము, భక్తిరసముతో కూడిన పాట, భక్తిరసముతో కూడిన నృత్యము, మతపరమైన యాత్రావిహారము, పండుగలు, తీర్థయాత్ర, దేవాలయాలను లేదా పుణ్యక్షేత్రాలను దర్శించడము. పూజాకార్యక్రమములో మోకరిల్లుట, సాష్ఠాంగదండప్రణామములర్పించుట, ప్రదక్షిణము చేయుట విధిగానుంటాయి.

వివిధ మతసంప్రదాయకులు దేవున్ని వివిధ మార్గాల్లో పూజిస్తున్నారు. కొందరు దేవున్ని నిరాకారునిగా తలుస్తూ పూజించగా; మరికొందరేమో ఆకారయుతునిగా తలుస్తూ విగ్రహమునో, ఛాయాచిత్రమునో, సజీవుడైన గురువునో దేవునిగా తలుస్తూ పూజించుచున్నారు. కనుక పూజలను రెండు విభాగాలుగా వర్గీకరణ చేయవచ్చును. 1) నిరాకార పూజ 2) సాకారపూజ. ఈ రెండింటి మధ్య ఉన్న భేదమేమిటో విచారించుదాము.
సాకారమనగా ఒక ఆకారముతోనున్న ఒక వ్యక్తియో లేక ఒకానొక విగ్రహమో వుండును. నిరాకారమనగా ఆకారములేని దైవచైతన్యము. ఈ ప్రపంచసృష్టి కాక మునుపు ఈ సృష్టికి కారణభూతమైన పదార్థమేదియో అది నిరాకారరూపమున వుండెనని ఊహించవచ్చును. కాని సృష్టికార్యములో ఆ దైవచైతన్యమే వివిధ రకములైన ఆకారాలుగా రూపాంతరము చెందినది. ఒక చెట్టు ఒక విత్తనము యొక్క స్థూలరూపము. ఇది ఒక విత్తనముగా ఉన్నప్పుడు అది ఒక పెద్ద చెట్టు యొక్క రూపాన్ని సూక్ష్మముగా తనయందు దాచుకొని యుండును. కనుక ఒక చెట్టు యొక్క నిర్మాణక్రమము మొత్తము దాని విత్తనములో దాగి ఉందని చెప్పవచ్చును. కనుక ఆకారనిరాకారములు ఒకదానియందు ఒకటి పడుగుపేకలై వున్నవని నిర్ణయము. ఆకారయుతమైన శరీరము లేకుండా నిరాకారమైన చైతన్యమునకు దేనినైన తెలిసికొనే అవకాశము లేదు. నిరాకారమైన కృష్ణపదార్థమో (Black Conscious Matter), బ్రహ్మపదార్థమో లేకుండా ఈ రంగులమయమైన అందమైన ప్రపంచసృష్టి జరిగి వుండదు. కనుక ఆకారము మరియు నిరాకారము ఒకే బ్రహ్మ (కృష్ణ) పదార్థము యొక్క స్థూల మరియు సూక్ష్మ విషయ కోణాలుగా ఉన్నాయి. కాని ఈ రెండు వేటికవే ఒకటి లేకుండా మరొకటి వుండలేవు. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి వున్నాయి. కనుక ఇవి ఒకే నాణెమునకు ఇరువైపుల వలె ఒకే వస్తువునందున్నాయి.

వివిధ మతసంప్రదాయకులు ఒకే బ్రహ్మపదార్థమును నిరాకారమని, సాకారమని రెండు కోణాలలో చూస్తూవున్నారు. ఉదాహరణకు కొంత నీటిని ఏ ఆకారముగల పాత్రలోనికి తీసికొంటే ఆ ఆకారమును పొందుతుందని అందరికి తెలిసిన విషయమే. కాని దానిని అగ్నితో వేడి చేసినప్పుడు ఆవిరి అగును. అప్పుడు ఆ ఆవిరికి రూపము లేదనియు అందరికి తెలిసిన విషయమే. కనుక ఒకే నీరు ఒకప్పుడు ఆకారము కలదిగాను, మరొక్కప్పుడు ఆకారములేనిదిగాను కనబడుచున్నది. కనుక ఈ విధముగానే బ్రహ్మపదార్థమునందు కూడ ఆకారనిరాకారములు వున్నవి. నిరాకారచైతన్యకృష్ణ పదార్థమే (Black Conscious Matter) వివిధాకారములుగల జగత్తుగా మారినది. మళ్ళీ ఈ వివిధాకారములుగల జగత్తు లయమై ప్రళయమునందు సూక్ష్మమై నిరాకారచైతన్యకృష్ణ పదార్థముగా మారగలదు. ప్రపంచంలోని వివిధ వ్యక్తులు ఈ బ్రహ్మపదార్థమును వివిధ కోణాలలో పూజించుచు దానిలోనే వివిధరూపాలను పొందుచున్నారు. కనుక నిరాకారపూజకు, సాకారపూజకు భేదమేమి లేదని నిర్ణయము.

కాని నిజగురూపదేశము లేకుండా ఎవ్వరైననూ పరిపూర్ణమైన తత్త్వజ్ఞానాన్ని పొందలేరు. వున్నదానిని ఉన్నట్లు, లేనిదానిని లేనట్లు చూడలేరు. యదార్థమును కనుగొనలేరు. లౌకికవిద్యలకే గురువు అవసరమైనప్పుడు, సూక్ష్మదృష్టి అవసరమైన పారమార్థిక తత్త్వవిచారణకు గురువు తప్పనిసరిగా అవసరము. నిజగురూపదేశము లేకుండా ఎన్ని వేల పుస్తకాలను చదివినగాని, ఎన్నిరకాల పూజలను చేసిననుగాని ప్రపంచము యొక్క సంక్లిష్ట స్వరూపముగాని జీవితము యొక్క పరమావధిగాని తెలియబడదు. బ్రహ్మజగత్తుల యొక్క రహస్యము అసలే అర్థము కాదు. ఆయా మతగ్రంథములు పైనుండి ఊడిపడినవు కావు. ఆయా మతప్రవక్తల ప్రవచనములే గ్రంథములుగా రూపుదిద్దబడినాయి. ఆ గ్రంథములను కూడా స్వంతముగా చదివినచో అర్థము కావు. అందుకొరకే ప్రతి మతములో గురువులో బోధకులో తప్పక వుంటారు. వారు ఆయా గ్రంథములలోని విషయములను వారి మతసంప్రదాయకులకు వివరిస్తూ వుంటారు. కనుక గురువు తప్పని సరి. శిష్యునికి గురువునకు మధ్య ఒక స్వేచ్ఛాయుత వాతావరణములో చైతన్యపూరితమైన సంభాషణ తప్పనిసరిగా జరుగవలయును. ఆ సంభాషణ వల్ల ముక్తిమార్గమునకు సంబంధించిన సకల సంశయాలు తొలగిపోగలవు. గురువులేకుండా ఎన్ని వేల పుస్తకాలను ఎన్ని వందల సార్లు చదివినను బ్రహ్మపదార్థము మరియు దాని రూపాంతరమైన విశ్వము యొక్క సమగ్ర స్వరూపజ్ఞానమును ఎవరు కూడా పొందలేరు. అచలసిద్ధాంత సంప్రదాయకుల దృష్టిలో సగుణనిర్గుణోపాసనలను రెండింటికి భేదములేదు. వీరు ఒక నాణెమునకున్న రెండువైపులా ఈ రెండింటిని చూస్తారు. ఇందులో ఒకటి లేక మరొకటి లేదు.

కాని ఇచట ఒక ముఖ్యమైన విషయము వున్నది. ఒక సాధకుడు ఒక గురువును కలిసికొని, అతనితో సంభాషించి, అతను చెప్పు విషయములందు ఆసక్తి ఏర్పడినచో అతనియందు సాధకునకు ప్రేమ భావము, భక్తి భావము కలుగ కలదు. ఆ తదుపరి ఆ గురువునకు శిష్యుడై ఆమూలాగ్రముగా బోధను గ్రహించి, ఆ గురువుగారి నుండి దూరముగా నున్నప్పుడు ఆ గురువు గారిని గుర్తుంచుకొనుటకు గురువుగారి ఛాయాచిత్రమును తన వద్ద నుంచుకోవడములో తప్పు లేదు. ఆ గురువుగారు బ్రహ్మాండైక్యము చెందిన తర్వాత ఆ గురువుగారి ఛాయాచిత్రమును పూజించుటలో తప్పు లేదు. కాని ఒక వ్యక్తిని కలియకనే, ఆయనతో సంభాషించకనే, ఆయన విగ్రహమును ఎన్నినాళ్ళు పూజించినను సత్యము అవగతము కాబోదు. విగ్రహాలను పూజించి బ్రహ్మజ్ఞానమును పొందిన వారెవరు చరిత్రలో లేరని మనకందరకు విదితమే కదా! కనుక అచలసిద్ధాంత సంప్రదాయకులు మూఢనమ్మకాలతో చేసే విగ్రహారాధనను నిరసిస్తారు.

కం. పురుషోత్తముడని పూజలు
నరులొనరించెదరు భువిని నానాచోట్లన్
ధర మొదలగు భూతములను
చిరుత శిశువులాడుకొనెడి చేష్టల రీతిన్!

అని అచలగురుసంప్రదాయక గురువరేణ్యులైన శ్రీ భాగవతుల కృష్ణదేశికులు ఉద్ఘాటించి వున్నారు. దీని అర్థమేమనగా? భూమి మొదలుకొని ఆకాశము వరకుగల ఐదుభూతములను పురుషోత్తముడని పూజలు చేయుట చిన్నపిల్లల బొమ్మలాటలాగే వుందని తెలియజేసినారు. కొందరు మానవులు భూమిలోనున్న శిలలతో తయారైన విగ్రహమును పురుషోత్తముడని వూహించి పూజించుచున్నారు. మరికొందరు గంగాయమునాగోదావరి అను మొదలగు నదులను పుణ్యతీర్థములనియూ వాటిలో మునిగినచో పాపములన్నియు తొలగుననియూ ఆ నీరే దైవమని పొగడుచున్నారు. ఇంకనూ కొందరు అగ్నితో హోమములను, యజ్ఞములను నిర్వహించుచు అగ్నియే దైవమని పూజించుచున్నారు. వాయువే హంసరూపమున జీవునికి ఆధారమై వున్నదని, శ్వాసమీద ధ్యాస వుంచి వాయువే దైవమని మరికొందరు నమ్ముచున్నారు. ఇంకనూ కొందరు ఆకాశమే బట్టబయలని, అదే దైవమని విశ్వసించుచున్నారు. క్షరాక్షరపురుషుల స్పర్శలేక వుత్తమ పురుషుని పద్ధతిలో నున్న సూరిజనుడగు అచలర్షియే పురుషోత్తముడుగాని పృథ్వ్యాదిభూతములతో తయారైన విగ్రహాదులు పురుషోత్తముడగునా? కాదని నిర్ణయము. అంతియేగాక భూతసముదాయమునందు తెలియబడుచున్న ఎఱుక నిర్మితములగు విరాట్టు, హిరణ్యగర్భ, అవ్యాకృత, ఈశ్వరులు కూడ పురుషోత్తములు కారని భావము.

సాకారపూజ: హైందవ సమాజములోని అనేక జనులు అనేక మహానుభావుల విగ్రహాలను పూజిస్తూ వుంటారు. వీరిలో ఎక్కువమంది జనులు తమకు తీరని కోరికలను లేక క్రొత్త సంకల్పములను మనస్సునందుంచుకొని వాటిని దైవానుగ్రహముతో తీర్చుకొనుటకో లేక వారి వారి కష్టనష్టములను తీర్చుకొనుటకో, రాబోవు విఘ్నములను నివారించుకొనుటకో విగ్రహపూజలను చేస్తూయుంటారు. తమ కుటుంబమును మొత్తము కాపాడితే ఇలానే ప్రతి సంవత్సరము ఈ పండుగను చేస్తామని ఆ దేవతా విగ్రహము ముందు మ్రొక్కి జంతుబలిని కూడ ఇస్తుంటారు. వీరు ఇచ్చే బలులు, నైవేద్యములు సర్వవ్యాపియు సర్వశక్తిమంతుడగు ఆ భగవంతునికి అవసరమా? అన్నిరకాల వంటలు వండుకొని ఆ విగ్రహములకు చూపించి వీరే గుంజుకొని తింటున్నారుగాని అవి ఏమైన తినుచున్నాయా? ఒకవేళ అవి ఏమైన తిన్నచో మరొకసారి వాటి ముందు ఏమైన పెట్టగలడా ఈ మానవుడు? ఇదంతా విచిత్రముగా నున్నది తప్ప, ఇందులో నిజము లేదు.

ఉదాహరణకు ఒక జంట వివాహమై పదివత్సరములైనను పిల్లలు కలుగక పోవుటచే అనేక దేవాలయములను, పుణ్యక్షేత్రములను, తీర్థములను దర్శించుచు సంతానము కొరకు పూజలు చేయుచుండిరి. ఐననూ సంతానము కలుగకపోవుటచే చివరకు విసిగి వేసారిపోయిరి. అప్పుడు సంతానము కలుగకపోవుటకు తమ యొక్క పూర్వజన్మ కర్మయే కారణమందురు. లేక దేవుడు తమకు వ్రాసిపెట్టలేదనియో అందురు. ఇందుకు విరుద్ధముగా మరొక జంట ఒక దేవతా విగ్రహమునకు పూజ చేసిన ఒక సంవత్సరములోనే ఒక బిడ్డను పొందిరి. అందువల్ల వారికి ఆ దేవపూజయందు విశ్వాసము కలిగెను. ఆ విశ్వాసముతోటే ఇంకా పెద్ద సంకల్పమును పూనుకొని కొన్ని కోట్లరూపాయల లాటరీని గెలుచుటకై అదే దేవపూజను మిక్కిలి భక్తితో చేసిరి. కాని ఆశించిన ఫలితము నెరవేరలేదు. అది పూజలోని దోషమా? లేక అది వారికి ప్రాప్తము లేదా? ఇదియునుగాక ఒక పూజవల్ల ఒక జంటకు సంతానము కలిగిన అదే పూజ చేసిన ప్రతి జంటకు తప్పనిసరిగా సంతానము కలుగ వలెను. కాని అటుల కలుగుట లేదు. ఇలానే అనేక సందర్భములను తీసికొన్నచో కేవలము పూజల వల్ల అభీష్టములు నెరవేరుటలేదని స్పష్టమగును.

కనుక వ్యక్తుల యొక్క శక్తిసామర్థ్యముల వల్లనో, వారి వారి పూర్వజన్మ సంస్కారముల వల్లనో వారికి భిన్నభిన్నమైన ఆశయములు కలిగి అందుకొరకై వారు చేయు కర్మను బట్టి అందుకు తగిన ఫలములు కలుగుచున్నవని తెలియబడుచున్నది. “యథా కర్మ తథా ఫలం” (As you sow, so shall you reap.) అను నానుడి సత్యమే కదా? ఇంకొక విధానములో ఏ ఏ దైవమును పూజిస్తే ఆ యా దైవము ద్వారా వారు కోరిన ఫలమును వారి వారి కర్మలను బట్టి నేనే ఇస్తున్నానని శ్రీకృష్ణపరమాత్మ గీతలో చెప్పిన విధానము సరియైనదేనా? అని సందేహము రావచ్చును. “యద్భావం తద్భవతి” - అని చెప్పినట్లుగా ఏ భావము మనయందుండునో ఆ విధముగానే జరుగును. మానవుడు ఒక దేవతా విగ్రహమును పూజిస్తూ ఏవో కొన్ని కోర్కెలను కోరుచూ దానికి సంబంధించిన పనులను చేస్తూ ఫలములు కలుగగా అవి దేవతానుగ్రహము వల్లనే కలుగుచున్నవని భావించుచున్నాడు. ఒకానొక సమయములో కొన్ని కోరికలు నెరవేరనప్పుడు, అది తమకు ప్రాప్తము లేదనియో, తమ కర్మ (fate) అనియో, విధి (destiny) అనియో ప్రతి ఒక్కరు అందురు. కనుక విచారించి చూడగా తన కర్మమే తనకు దైవము వ్రాసిన వ్రాతగా వున్నదని తెలియబడుచున్నది. అందుకే వేమనార్యులు ఏమన్నారంటే

ఆ.వె. వ్రాతకొలది గాని వరమీడు దైవంబు
చేత కొలది గాని వ్రాత కాదు
వ్రాతకజుడు కర్త చేతకు దా గర్త
విశ్వదాభిరామ వినుర వేమ!

నిరాకారపూజ: క్రైస్తవులు, ముస్లిములు, మరికొన్ని మతసంప్రదాయకులు విగ్రహాలను పూజించరు. విగ్రహారాధన చేయని ఈ హైందవేతరులు కొందరు విగ్రహాలను పూజించడమును పాపక్రియగా భావిస్తారు. కాని వారు నిరాకారుడగు దేవుడు స్వర్గమునందున్నాడని, అతనిని ప్రార్థనలచే ఆరాధిస్తూ వుంటారు. వారి ప్రార్థనల యొక్క ఉద్ధేశ్యము ఏమిటి? మనము పై సందర్భములో చర్చించబడిన విషయములను ఈ సందర్భములో కూడా చర్చించ వచ్చును. ఈ ప్రజలు నిరాకారుడగు దేవుని గూర్చి ప్రార్థన చేస్తూ వారి మనస్సు యందున్న కోరికల చిట్టాలనే విప్పుతారు. వారు చేసిన పాపాలకు ప్రాయశ్చితమును అడుగుతారు. అంతేగాక వారి ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి కావలసిన శక్తినివ్వమని దేవున్ని కోరుకొంటారు. వారి వారి లక్ష్యాలను సాధించడానికి వారికి సహాయము చెయ్యమని దేవున్ని వేడుకొంటారు, ఎక్కడో వున్నాడని తలచుచున్న ఆ నిరాకారుడగు దేవుడు ఈ ప్రార్థనలను విన్నదీ లేదు, వారి సమస్యలను తీర్చినదీ లేదు. ఆ రాతివిగ్రహాల మాదిరిగానే ఈ నిరాకారుడగు దేవుడు వీరి విన్నపములను వినలేడు, కనలేడు. ఊహపోహలు తప్ప ఎక్కడున్నాడో ఆ నిరాకారుడగు దేవుడు వీరికి తెలియదు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి చర్చికో లేక మసీదుకో ప్రతిరోజు వెళ్లి ప్రార్థనలు చేసి ఉద్యోగం పొందడానికి ఒక నెల పట్టవచ్చును. అప్పుడు అతనికి ఈ ఆరాధనపై నమ్మకం కలుగును. ఇదే రకమైన ప్రార్థనను అదే రకమైన భక్తితో మరొక వ్యక్తి కొన్ని సంవత్సరాలపాటు చేసినను ఉద్యోగము దొరుక లేదు. అప్పుడు అతనికి ఈ ప్రార్థనలందు నమ్మకము కుదరదు. కనుక కోరిక నెరవేరినప్పుడు మాత్రమే విశ్వాసము లేదా నమ్మకము కుదురును, లేనిచో నమ్మకము కుదరదు. కాని విచారించి చూడగా వారి వారి కర్మానుసారమే వారు ఆశించినవి జరుగుచున్నవిగాని, వారి వట్టి ప్రార్థనల వల్ల వారి కర్మఫలములలో మార్పు లేదని స్పష్టమగుచున్నది. కాని యదార్థతత్త్వజ్ఞానమును గురునిచే పొందినవారు, ఆ జ్ఞానమును తమ కర్మాచరణయందు ప్రవేశపెట్టి ప్రార్థనలను చేసి హృదయమును పరిశుద్ధము చేసికొని సమిష్టి ప్రాణసత్తయొక్క శక్తిని పొంది వ్యష్టిదృష్టిని విడచి సమిష్ట్యంతఃకరణదృష్టిచే తమ సంకల్పబలముతో తమకు సాధ్యమగు పనులన్నింటిని త్రిలోకములయందు కూడ సాధించగలరు. ఇది లౌకికమునకు సంబంధించినది. ఇక పారమార్థికమగు ఆత్మతత్త్వమును సద్గురువులచే తెలిసికొని జననమరణభ్రాంతిరహితరూప మోక్షమును పొందుచున్నారు. ఇందులో సందేహము లేదు. ఏ రకమైన పూజలు చేయనివారును, యదార్థతత్త్వజ్ఞానమును పొందనివారును కూడ కొందరు లౌకిక విషయములయందు విజయమును సాధించి సమాజమునకవసరమైన క్రొత్తరకమైన ఆవిష్కరణములను చేసి మన్ననలను పొందుచున్నారు. అంతేగాక అనేకరకములైన వ్యాపారాదులను జేసి అత్యంతసంపన్నులగుచున్నారు. కాని వీరు కర్మచట్రమునందే తిరుగుచు పుర్జన్మనెత్తుచున్నారు.

కనుక ప్రాప్తమున్న వారు కర్మఫలాలను తప్పక పొందుచున్నారు. ప్రాప్తములేని వారు ఎన్ని సార్లు ప్రయత్నము చేసినను ఆ కార్యమును సాధించలేక పోవుచున్నారు. ఒక లక్ష్యాన్ని సాధించడానికి తనకు సాధ్యమైన అన్ని రకాల ప్రయత్నాలను ఒక వ్యక్తి చేయవలసి వుండును. అయినను చివరకు ఫలితము ఆ వ్యక్తి చేతిలో లేదు. ప్రతిక్రియ అనేకమైన వైవిధ్యమైన క్రియలతో కూడుకొని వుండును. కాని ఏ పనిని చేయకుండా ఎవరైనను అనుకూల ఫలితమో లేక ప్రతికూల ఫలితమో పొందలేరు. దీనికి వ్యతిరేకముగా కొన్ని సార్లు సందర్భమును బట్టి ఊరకనే కూర్చోవడము కూడ అనుకూలమో లేదా ప్రతికూలమో అవుతుంది. కొన్ని సార్లు మనము వెయ్యి సార్లు ప్రయత్నము చేసినను ఫలితమును పొందలేము. అందుకు వ్యతిరేకముగా కొన్ని సార్లు ప్రయత్నము లేకుండానే ఫలితమును పొందగలము. అమెరికాలో ఈ కాలములో రెండు డాలర్ల టికెట్టుకొనిన నిరుపేదవాడు కొన్ని వందల మిలియన్ల డాలర్లను లాటరీయందు గెలుచుకొనుచున్నాడు. అది పూర్వజన్మ సుకృతమేగాని ఈ జన్మలో కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా?

కనుక జరిగేది జరుగక మానదు. జరుగనిది జరుగదెప్పుడైనను. ఇది లోకవిదితమే. కాని కొన్ని సృష్టిధర్మములను ఎవరు కూడ మార్చలేరు. భూమిని తన కక్ష్యలో వ్యతిరేకదిశలో పోయేటట్లు ఎవరైనను మార్చలేరు. వృద్ధాప్యము లేకుండా వంద సంవత్సరాలు ఎవరు కూడ బ్రతుక లేరు. సూర్యునిపై ఎవరు కూడ సంసారము చేయలేరు. భూతకాలములోనికి వెళ్ళి ఎవరు కూడ సంచరించలేరు. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా ఎవరు కూడ చేయలేరు. గతజన్మలో మనము చేసిన పాపపుణ్యకర్మల యొక్క ఫలితముల వల్లనో లేక ప్రస్తుత జీవితంలో మనము చేసిన పాపపుణ్యకర్మల వల్లనో మనమందరము సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాము. ఈ జీవితములోనో లేదా తదుపరి జీవితములోనో ఫలితాలను పొందడానికి మనము చేసే కర్మ ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటున్నాము.

ఆశయమునకు తగిన కర్మ లేకుండా కేవలము సగుణోపాసన వల్లనో, నిర్గుణోపాసన వల్లనో, మరొక రకమైన ప్రార్థన వల్లనో, ధ్యానము వల్లనో మన ఆశయము ఎప్పుడైనను నెరవేరదు. ఒకవేళ అది నెరవేరినను పూర్వజన్మకర్మానుసారమేగాని ఇంకొకటి కాదు. కనుక మనము చేసే అన్నికర్మల యొక్క ఫలితము సంచితములో చేరుతుంది. సంచితములో నున్న ప్రారబ్దకర్మను మనము నేడు అనుభవిస్తూ వున్నాము. ఈ జన్మలో మనము క్రొత్తగా చేయుచున్న ఆగామికర్మ మరొక జన్మకు ప్రారబ్దకర్మగా తయారగుచు సంచితములో చేరుతున్నది. ఎఱుకయను పదార్థమునకు పారమార్థిక సత్యత్వము లేదుగాని, వ్యవహారిక సత్యత్వము వున్నది. కనుక చేసిన కర్మలకు వచ్చే ఫలాఫలాలను సగుణోపాసనవల్లనో, నిర్గుణోపాసన వల్లనో ఎవరు కూడ మార్చలేరు. ఎప్పుడో ఒకప్పుడు ఫలాఫలాలను పొందవలసినదే. కాని చేయనున్న కర్మయందు మాత్రము తనకు అధికారము కలదు. మంచి కర్మ చేసినచో మంచి ఫలము, చెడు కర్మ చేసినచో చెడు ఫలితమును పొందవలసినదే.

ఇంకా కొందరు విగ్రహము ద్వారా దేవతనో, దేవున్నో పూజిస్తున్నామని చెప్పుచుంటారు. ఇందులో కూడ అర్థము లేదు. ఆ దేవుడినో, ఆ దేవతనో వీరు ఎప్పుడైనను చూచినది లేదు, వారితో మాట్లాడినది లేదు. వీరు చేసిన ప్రార్థనలను వారు విన్నది లేదు. వీరు పెట్టిన నైవేద్యమును వారు ఆరగించినది లేదు. కనుక ఇదొకరకమైన భ్రాంతియేనని తెలియబడుచున్నది. అదియునుగాక అంతటనున్న భగవంతుడు ఒక పరిమితమైన ఆకారముగల విగ్రహములోనికి రాగలడా? ఒకవేళ వచ్చినచో ఆ భగవంతుడు కొంత పరిధిలోనున్న వాడే అగుచున్నాడు కదా? కనుక అతడు సర్వముననున్న భగవంతుడెట్లు కాగలడు?

కొందరు వంశపారంపర్యముగా వచ్చుచున్న జపతపవ్రతాదులను మూఢనమ్మకము వల్లనో, భయము వల్లనో కొనసాగిస్తారు. ఎందుకనగా? వాటిని చేయకున్నచో తమకు ఏమైనా కష్టనష్టములు రావచ్చునని అనుమానములను కలిగియుండుటయేగాని వాటిపై భక్తితో కాదు.

క్రొత్త క్రొత్త దేవుళ్ళకు, క్రొత్త అవతారపురుషులమని పొగడించుకొనే వారికి గుళ్ళు, గోపురాలు, మందిరాలు వెలుస్తున్నాయి. వారి పేర్లతో పండుగలు, పబ్బాలు జరుగుచున్నాయి. హిందువులకు 33 కోట్ల దేవతలు కలరు. ఇంకా ఎంతమందినైనా ఈ సంఖ్యలో కలుపుకోవచ్చును. జీవిత విధానాలను, జీవిత కళలను నేర్పించే మహానుభావులు మనదేశంలో ఎప్పటికప్పుడు జన్మిస్తూనే ఉన్నారు. ఇంటిదేవతయని, కులదేవతయని, గ్రామదేవతయని కొందరు అనేక రకముల దేవతలను కొలచుచున్నారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనేక దేవతా విగ్రహములను ఒకచోటబెట్టి మ్రొక్కుచూ కాపాడమని వేడుకొంటారు. అందులో ఏ ఒక్కరైనను తమను రక్షించగలరని వారి ప్రగాఢవిశ్వాసము. మరికొందరు ఏ ఒక్క దేవుడినో లేక ఏ ఒక్క దేవతనో మాత్రమే పూజిస్తారు, మరొక దేవతనుగాని, దేవున్నిగాని తలచరు, పూజించరు. ఇంకొందరు శ్రీలక్ష్మీమహావిష్ణువులు వైకుంఠమున, శివపార్వతులు కైలాసమున నేటికినీ వున్నారని వూహించుచు వారి వారి విగ్రహములకు ఆరాధనలు చేయుచూ వారిని ప్రగాఢముగా విశ్వసిస్తున్నారు.

అద్వైతమతప్రవక్తలు జగత్తు మాయని, ఈ జీవుడు నిర్గుణనిరాకారబ్రహ్మస్వరూపుడేగాని అన్యుడుగాడని చెప్పుచూ వివిధాకారములుగల విగ్రహములనే పూజించుచున్నారు. ఆ పూజలన్నియు వారి మతాభిప్రాయమునకు విరుద్ధముగనే వున్నవని తెలియబడుచున్నది. ఎందుకనగా? ఆ బ్రహ్మమును నిర్గుణుడనియూ అనగా ఏ గుణములు లేనివాడనియూ, ఏ ఆకారములు లేనివాడనియూ పొగడుచూ ఆ బ్రహ్మమును విగ్రహముల ద్వారా పూజించుచున్నామని భ్రాంతిజెందుచున్నారు. వారు ఏ విధముగా సగుణమైన శరీరముతో ఆ నిర్గుణబ్రహ్మమును పూజిస్తున్నారో వారికే తెలియదు. నిర్గుణమైన బ్రహ్మము మాటలాడదు, ఉపదేశించదు. కనుక ఆ పూజల వలన ఏమి ప్రయోజనమో వారికి తెలియదు. నిర్గుణోపాసన కష్టతరమని వేదికలపై ఉపన్యాసములిచ్చుచుంటారు కూడ! ఎందుకో ఆ వృధా ప్రయాస?

కొందరు మనిషికి ఎందుకు మ్రొక్కుతున్నారని విచిత్రముగా అడుగుచూ గేలి చేయుచుంటారు? తత్త్వజ్ఞానమును బోధించు మానవరూపములోనున్న దేవునికి మ్రొక్కకుండా రాళ్ళకు మ్రొక్కితే ఏమి ప్రయోజనము కలదు? శ్రీమహావిష్ణువు యొక్క విగ్రహమునో, శివలింగమునో, శ్రీరాముని విగ్రహమునో, శ్రీకృష్ణుని విగ్రహమునో ముందుపెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఆ మహానుభావులు కూడ ఒకానొక కాలములో మానవులే కదా? వారికి కూడ గురువులున్నారు కదా? ఈ విషయమును తెలిసికొనరు. ఒకవేళ తెలిసినను మూర్ఖముగా శిలలకే పడిపడి మ్రొక్కుచుంటారుగాని సద్గురువెక్కడున్నాడోయని వెదుకరు. ఒకవేళ ఆ సద్గురుడే వీరిని వెదుకుతూ వచ్చినను గుఱ్తించి వారి పాదములపై సాగిలపడరు.

ఆత్మజగత్తులకు సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానమును పొందుటకు, సృష్టి యొక్క రహస్యమును తెలిసికొనుటకు ఒక పరిపూర్ణ భావజ్ఞుడైన గురువు తప్పక అవసరము. అట్టి గురువును వెదకి, చేరుకొని, సేవించి, పూజించి శిష్యుడైనవాడు అతని నుండి తత్త్వజ్ఞానమును పొందవలసి వుండును. ఆ తత్త్వజ్ఞానముచే శిష్యునికున్న సర్వభ్రాంతులు నశించగలవు. ఆ గురుదేవుని పూజలో గురుని ఆకారముతో పాటు సర్వవ్యాపియగు గురుదేవుని అంతఃకరణచైతన్యము కూడ పూజించబడును. శరీరము, ఆత్మచైతన్యము వేరు వేరుగా లేనందున గురునికి పూజ చేసినచో అది సగుణనిర్గుణోపాసనలతో కూడిన పూజ కాగలదు. ఈ పూజ ఆరాధనకు సంపూర్ణార్థమును ఇవ్వగలదు. ఏ ఒక్క ఆకారముతోనున్న విగ్రహమునో, ఛాయాచిత్రమునో లేక ఏ ఒక్క నిరాకారమగు శక్తినో, చైతన్యమునో పూజించుట వల్ల అవి మానవునికి బోధ చేసి సంశయములను తీర్చలేవు. కాని ఆకారనిరాకారముల(శరీరాత్మల)తో కూడిన సజీవుడైన సద్గురునకు పూజ చేసినచో, ఆ సద్గురుడు అనుగ్రహించి పరిపూర్ణమైన తత్త్వజ్ఞానమును శిష్యునకు ఉపదేశించును. ఆ తత్త్వజ్ఞానము వలన శిష్యుని సకలసంశయములు తొలగిపోవుటయేగాక సాంఘిక సాధనములందు నిర్విషయాంతఃకరణ ప్రవృత్తి కలిగిన కర్మకౌశలత్వమేర్పడి ప్రయోజనకారిగా వుండుననుటలో సందేహము లేదు.

శ్రీమద్భగవద్గీతయందు శ్రీకృష్ణపరమాత్మ తత్త్వజ్ఞానమును పొందగోరువారు ఏ విధముగానుండాలో చెప్పుచూ జ్ఞానప్రాప్తికి ఒకే గురువుయందు భక్తి కలిగి యుండాలని ఈ క్రింది శ్లోకములో ఉపదేశించినారు.

శ్లో. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది ||
(శ్రీమద్భగవద్గీత - 13 అధ్యాయము – 10 శ్లోకము)

ఈ శ్లోకము యొక్క భావమేమనగా? అనన్యయోగము ద్వారా అవ్యభిచారిణిభక్తి కలిగియుండుట, ఏకాంతపవిత్రప్రదేశమున ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ప్రీతి లేకుండుట జ్ఞానప్రాప్తికి సాధనములు. కనుక సాధకుడు అనేకవిగ్రహాదులయందుగాక ఒకే గురువును అవ్యభిచారభక్తితో ఆరాధించవలయును.

శ్లో|| శిలాయాః కిం పరం జ్ఞానం? | శిలాసంఘ ప్రతారణే |
స్వయం తర్తుం న జానాతి | పరం నిస్తారయేత్కథం? || - గురుగీత

రాతికి శ్రేష్ఠమైన జ్ఞానమెక్కడిది? జనుడు అట్టి రాళ్ళ యొక్క సమూహమును (ప్రతిమలను) అజ్ఞానము వలన దైవమనెడి భావమున సేవించుచున్నాడు. తాను కడతేరు మార్గమును ఎఱుగనివాడు పరులను ఎట్లు తరింపజేయును? అట్టి అజ్ఞాని ఇతరులను తరింపజేయలేడని గురుగీత చెప్పుచున్నది. కనుక తత్త్వజ్ఞానమును పొంది మానవోత్తములని మానవదేవతలని మన్ననలొందుచున్న ఋషివర్యులో యోగివర్యులో కూడ ఇతర దేవతావిగ్రహములకు పూజచేయుచూ ఆ విగ్రహములన్నియు గురుస్వరూపమని తలచుచు మ్రొక్కుట వలన ఏమైన ప్రయోజనము వున్నదా? అందువలన ప్రయోజనము లేదని తెలియబడుచున్నది.

ఎందుకనగా? సర్వమునందున తనను, తనయందు సర్వమును దర్శించిన యోగి బ్రహ్మాండమంతయు తన గర్భముగా తలంచును. ఆ యోగి చిన్న రాతి ముక్కను దేవుడని మ్రొక్కుట చక్రవర్తి పోయి సేవకుని కాళ్ళను పట్టుకున్నట్లుండును. ఎందుకనగా? శిలలో మందమైన చైతన్యమే వున్నదిగాని వుత్కృష్టమైన చైతన్యము లేదు. అదియునుగాక ఆ యోగి రాతి ముక్కను మ్రొక్కుచుండగా ఎవడైనా ఒక అజ్ఞానజనుడు చూసినచో, వానికి ఏమి తోచుననగా? అంతటి యోగియే అతడెంత తెలిసికొన్ననూ ఈ రాతిముక్కను మ్రొక్కుచున్నాడు, నేను అతని నుండి తెలిసికొనవలసినదేమున్నది? నేను కూడ ఈ రాతికే మ్రొక్కుచున్నాను కదా? అని తనలో తను అనుకొనుచు సంతృప్తిపడి ఏ గురువును చేరక, తత్త్వజ్ఞానమును పొందక అధోగతి పాలగును. కనుకను ఆ యోగి ఈ అజ్ఞానిని అంధకారములోనికే నెట్టినవాడగును. “యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” (శ్రీమద్భగవద్గీత) - ఉత్తములు అయినవారు దేనినాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరించును. కనుక పూర్ణవిషయమును గ్రహించిన మానవదేవతలును, మానవోత్తములును అగు అచలఋషులు ప్రవర్తనయందు బహుజాగ్రత్తతో మెలగుచు తమ గురుదేవులకు, సంప్రదాయ గురుపరంపరకు తప్ప ఇతర దేవతావిగ్రములకు ఎప్పుడైననూ, ఎక్కడైనను మ్రొక్కరు.

ఆ.వె. దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్త్వమెరిగెనేని దైవసముడు
ఏమిలేని నరునకేగతి లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

గురుదేవుని పూజ వల్ల అనేక దివ్యభోగములు కలుగును. ఆ గురుదేవుడు ఉపదేశించు తత్త్వజ్ఞానమును దర్శించినచో ఆ శిష్యుడు ప్రకాశస్వరూపుడైన దైవమే తానని తెలిసికొనగలడు. ఏమిచేయకుండా వున్నవాడికి ఏ గతియూ లేదని తెలియజేయుచున్నాడు వేమన పై పద్యములో. కనుక మానవుడు గురువులేకుండా కేవల విగ్రహారాధన వల్ల బ్రహ్మజ్ఞానమును ఎప్పుడైనను పొందలేడని తెలిసికొని, అతడు నిజగురువును వెదకి, చేరుకొని, సేవించి పూజించి ఆత్మచైతన్యమును గూర్చిన జ్ఞానమును, దాని పరిణామరూపమైన జగత్తును గూర్చిన సృష్టిస్థితిలయవిస్తీర్ణాకర్షణాది విషయవిజ్ఞానమును, అచలపరిపూర్ణ రాజయోగ సిద్ధాంత తత్త్వనిర్ణయమును గురుని యొక్క కృపావిశేషముచే పొందవలసిన కర్తవ్యమున్నదని గుఱ్తించవలయును. నిజగురువుల ఉపదేశము ద్వారా అచలపరిపూర్ణ రాజయోగ తత్త్వజ్ఞానమును దర్శించిన వారు ఎఱుకయే భ్రమరూపమని మరియు దాని వలన కలుగుచున్న సంచిత, ప్రారబ్ద, ఆగామి కర్మలను కూడ భ్రమరూపమని తెలిసికొని ఈ కర్మచక్రమునందు చిక్కుకొనకుండా నుండుటకు అహంపదార్థరహిత స్థితియందుండి కర్మలేని, జన్మలేని విధానమునందు నడచుకొను వారికి కర్మానుభవమే వుండదు. వారిని చూచేవారికే కర్మానుభవము తోచుచుండును గాని, వారికి ఎలాంటి అనుభవము వుండదు, ఎందుకనగా వారు అహంపదార్థ స్థితియందుంటారు గనుక.
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to వ్యాస రచనలు

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron