జీవపరిణామము:

చమత్కార/హాస్య వ్యాసాలు, పరిశోధనాత్మక/సందేశాత్మ/విమర్శాత్మక వ్యాసాలు .... అన్ని రకాల తెలుగు వ్యాస రచనలు - మీ స్వీయ రచనలు లేదా మీ అభిమాన వ్యాసరచయిత వ్యాసాలు (మీ వ్యాఖ్యానంతో), వాటి మీద చర్చలూ!

జీవపరిణామము:

Postby Dr.Rapelli_Sridhar » Sun Dec 03, 2017 12:54 pm

జీవపరిణామము:
___________________
డా. శ్రీధర్ రాపెల్లి


సృష్టి క్రమవికాసము చెందినదని పూర్వఋషుల నుండి నేటి ఆధునికశాస్త్రవేత్తల వరకు అభిప్రాయ పరంపర కొనసాగుచున్నది. కనుక సృష్టికికారణభూతమైన బ్రహ్మపదార్థమునందలి స్థూలప్రకృతి పంచభూతములుగాపరిణామము చెందగా, సూక్ష్మప్రకృతి అనేకరకముల జీవోపాధులుగా అనేక కోట్లసంవత్సరముల కాలక్రమములో ఉద్భవించుచున్నవని తెలియబడుచున్నది. సృష్టిలో మొత్తము 84 లక్షల రకముల జీవోపాధులు ఉన్నాయని విష్ణుపురాణములోచెప్పబడినది. అందులో కొన్ని జీవోపాధులు వాటి వాటి కర్మానుసారముగా అప్పుడప్పుడు లుప్తముకాగా, మరికొన్ని నూతన జీవోపాధులు అప్పుడప్పుడు వాటివాటి కర్మానుసారముగ ఆవిర్భవించుచున్నట్లుగా కూడ తెలియబడుచున్నది. ఆధునిక జీవపరిణామ సిద్ధాంతమునకు ఆద్యుడుగా డార్విన్‌ను పేర్కొంటారు. “ప్రకృతిలోని మనగలిగే వాతావరణాన్ని సులభముగా అలవరచుకునే బలముగల్గిన జీవులు నిరంతరాయముగా వర్ధిల్లి మరింత ఉన్నతికి పరిణామము చెందుతాయి” అని డార్విన్‌ మహాశయుడు తన సిద్ధాంతములో చెప్పినాడు. ఈ సూత్రము ప్రపంచవ్యాప్తముగా జీవశాస్త్ర అధ్యయన విధానాన్ని క్రొత్తపుంతలు త్రొక్కించినది.''ఉనికికోసం సంఘర్షణ - తట్టుకుని నిలబడగలిగిన జీవులకే ఉనికి'' అన్న అభిప్రాయాన్నిఈ ఆధునిక పరిణామ విజ్ఞానము కలుగ చేసినది.

ఐతే విశ్వవిఖ్యాత తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. "బతుకు లేదా ఉనికి కోసము పోరాటము - పోరాటములో తట్టుకొని నిలిచినవారికే ఉనికి" అన్న సిద్ధాంతము వల్ల బలవంతులు మాత్రమే బ్రతుకు తారు, బలహీనులు చస్తారు అన్న భావన అంతర్లీనంగా ధ్వనిస్తుంది. అందువల్ల డార్విన్‌ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతము మానవకళ్యాణమునకు దోహదపడేదిగా లేదు అన్నది రస్సెల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయము.

స్వామి వివేకానంద డార్విన్‌ ప్రతిపాదించిన పరిణామసిద్ధాంతముపై వ్యాఖ్యానిస్తూ "జంతు ప్రపంచంలో జీవన పోరాటము - బలవంతునదే గెలుపు'' అనే సిద్ధాంతములు బాగా వర్తిస్తాయి. అందుకని డార్విన్‌ 'జీవపరిణామ సిద్ధాంతము కొంత వరకూ నిజమేనని కొందరు నమ్ముచున్నారు. కానీ, మానవసామ్రాజ్యములో బుద్ధి, విచక్షణ, వ్యక్తీకరణ ఉండడం వల్ల డార్విన్‌ సిద్ధాంతము మానవుల విషయములో చెల్లదు. మనిషి ఉన్నతస్థితి అతని త్యాగబుద్ధి ఆధారముగానే గుర్తింపు పొందుతుంది. ఇతరుల కొరకు త్యాగము చేయగలిగిన వాడు మానవులలో గొప్పవాడుగా పరిగణింపబడతాడు. అదే జంతుసామ్రాజ్యములో బలము కలిగి ఎక్కువ జీవులను చంపగల శక్తిగల జంతువే గొప్ప జంతువుగా గుర్తింపబడుతుంది. ఈ కారణముల వల్ల డార్విన్‌ ప్రవచించిన సిద్ధాంతము జంతువులకూ, మనుషులకూ సమానముగా వర్తించదు. మనిషి చేసే పోరాటము మానసికమైనది. ఏ మనిషి తన మనసును నియంత్రించుకొని స్థితప్రజ్ఞ లక్షణమును సాధిస్తాడో అతడు తన ఆత్మను విష్కరించుకోగలడు" అన్నారు.

జీవపరిణామము గురించి పతంజలి వ్యక్తము చేసిన అభిప్రాయమేమిటనగా: "జాత్యంతర పరిణామ: ప్రకృత్యా పురాత్‌|| - జీవి మరోజీవిగా మారడానికి కారణము దాని అంత: ప్రకృతి. – (పతంజలి యోగా సూత్రాలు, అధ్యాయము 4 శ్లోకము 2.) జీవులు ఒక ఉపాధి నుండి ఇంకొక ఉపాధికి మారటానికి కారణం వాటిలోని అంత: స్వభావం. పాప, పుణ్యములు ఈ పరిణామమునకు ప్రత్యక్షకారణాలు కావు. అవి కేవలం అడ్డంకులు మాత్రమే. తన పొలములో నీటిపారుదలకు కలుగు అడ్డంకులను రైతు తొలగించుకొని ముందుకు సాగాలి" అన్నది పతంజలి చెప్పినదాని సారాంశము. ఈ సిద్ధాంతాన్నే స్వామి వివేకానంద తన రాజయోగ భాష్యంలో వివరిస్తూ 'పరిపూర్ణత మానవుని తత్త్వం'' ఈ విషయాన్ని ప్రకటించడంలోనే కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఎవరైనా ఈ ప్రవృత్తిని దాటగలిగితే తన స్వత: సిద్ధమైన శక్తిని పొందగలడు. మనిషిని పరిపూర్ణత వైపు నడిపించేది ఆ ప్రవృత్తియే. అదే అందరినీ అక్కడకు చేర్చుతుంది. పరిపూర్ణత సాధించడం మానవుల జన్మహక్కు అంటూ వివేకానందుడు "ప్రాచీన ఋషులు చెప్పిన మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఆధునిక విజ్ఞానం సహాయంతో మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పటికీ ఆ యోగి పుంగవుల వివరణలు ఉన్నతమైనవి. ఆధునిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన 'లైంగిక భాగస్వామి ఎన్నిక', 'బలవంతుడే మనగలడు' అనే రెండు సిద్ధాంతాలు అసంపూర్ణమైనవి. ఒకవేళ ఆధునిక శాస్త్ర విజ్ఞానం పురోగతి చెంది భాగస్వామిని ఎన్నుకోవడం, భౌతిక శక్తిని పొందగలిగే సమర్థులను కనుగొంటే పోటీ లేని ఆ కాలంలో మానవ పరిణామం ఆగిపోతుందా! జాతి అంతరిస్తుందా! దీనికి ఆధునిక విజ్ఞానం సమాధానం చెప్పదు." - అని తెలియజేశారు.

అచల సిద్ధాంతము ప్రకారముగా ఒక జీవోపాధి నుండి మరొక క్రొత్త జీవోపాధిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరములు పట్టును. సముద్రజలము యందు నాచు ఏర్పడి దాని వల్ల జలచరములు మొదలగు నీటి జంతువులు, కఠినమగు భూమి, దీని నుండి స్థావరములనబడు (చెట్లనబడు) ఓషధులు - దీని నుంచి క్రిమికీటకములు, వాటినుండి పక్షులు, వాటి నుండి పశువాదులగు నాలుగు కాళ్ళ జంతువులు, అందులో వానరులు, వానరులను నుండి మానవులు కలిగిరి. ఇందులో జలచరోపాధి ప్రథమము, మానవోపాధి అంత్యము. జలచరోపాధి నుండి కర్మానుసారముగా మానవోపాధి కలిగినట్టుగా, మానవోపాధినుండి కర్మానుసారముగా పశు, పక్షి, క్రిమి, కీటకాదులు కలుగును. కనుక మానవోపాధికి పైగా ఉపాధులు లేవు. దైవోపాధి కలదేమో? మానవోపాధియందే దైవోపాధి, పశువోపాధి, రాక్షసోపాధి - కలదు. కాని అవి వేరుగా లేవు. కనుకనే మానవ భేదములు నాలుగు లక్షలని చెప్పబడి యున్నది.

మానవుడు కూడా మొదట్లో వానరుడుగా సంచరించిన వాడే. మొట్ట మొదటి మానవుడు జంతురూపములోన వుండి వున్నాడు. మానవుడు కోతుల సంతతి నుండి వచ్చిన వాడే. వనములందు సంచరించుచు ఆకులు, పండ్లు, కాయలు మొదలగు వాటిని తింటూ చెట్ల తొర్రలలోననో, గుహలలోననో జీవించిన వాడే, నాగరికత చెందిన మానవునిగా పరిణామము చెందడానికి కొన్ని వేలకొలది సంవత్సరములు పట్టినది. భాషలు ఉద్భవించడానికి కూడ కొన్ని వేలకొలది ఏండ్లు పట్టినది. అనేక ఉపాధులు వచ్చిన తర్వాత, ఒక జీవోపాధిలోని సూక్ష్మశరీరమే మరొక ఉపాధిని పొందుచున్నది. ఇది ఆయా సూక్ష్మశరీరములందని అంతఃప్రవృత్తియగు కర్మ వల్లనే జరుగుచున్నది. కనుక కర్మకు తగిన ఉపాధి ఆయా సూక్ష్మశరీరములకు సిద్ధించుచున్నదని తెలియబడుతుంది. కర్మవల్ల జన్మ, జన్మ వల్ల కర్మ కల్గుచున్నది. కనుక పూర్ణ విషయమును పరిపూర్ణ గురువులను జేరి తెలిసికొనగోరుచున్నాను.
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to వ్యాస రచనలు

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron