మతములు - వాటి యందలి అపవాదములు

చమత్కార/హాస్య వ్యాసాలు, పరిశోధనాత్మక/సందేశాత్మ/విమర్శాత్మక వ్యాసాలు .... అన్ని రకాల తెలుగు వ్యాస రచనలు - మీ స్వీయ రచనలు లేదా మీ అభిమాన వ్యాసరచయిత వ్యాసాలు (మీ వ్యాఖ్యానంతో), వాటి మీద చర్చలూ!

మతములు - వాటి యందలి అపవాదములు

Postby Dr.Rapelli_Sridhar » Mon May 14, 2012 10:57 pm

మతములు: వేదాంతమునందు ప్రతిపాదించబడిన బ్రహ్మ తత్వమును సమగ్రముగా అర్థము చేసికొనలేకపోవుటచే మరియు భిన్న భిన్న శృతి, స్మృతి, ఇతిహాస, పురాణములను సమన్వయము చేసికొనలేక పోవుటచే దేశ, కాల, పరిస్థితులను అనుసరించి అనేక మతములు ఆవిర్భవించినవి. మతములన్నియు బుద్ధి నిశ్చయముగానే వుండి మతాచార్యుల వ్యష్టి దృక్పథములనే బోధించుచున్నవిగాని పరిపూర్ణ వస్తు నిర్ణయ జ్ఞానమును బోధించుట లేవు. మతాచార్యులు వారి వారి అంతఃకరణ పద్ధతిని అనుసరించి ప్రస్థానత్రయమునకు భాష్యములు వ్రాసి పేరు ప్రతిష్ఠలు సంపాదించినారేగాని లోకమునకు సత్యమును బోధించలేదు. రాజ్యాధికారమునకై మతయుద్ధములు జరిగి లోకమునకు మేలుకన్నా కీడే ఎక్కువగా జరిగి వుండెను. మతవాదులు వేదోపనిషత్తులయందలి శృతులను ఉదహరించుచు వాదోపవాదములను చేయుచు, ఒకరి మతమును ఒకరు ద్వేషించుకొనుచు, సత్యమును తెలిసికొనలేక తికమక పడుచున్నారు.

వేద కాలము తర్వాత మానవుల యొక్క ప్రవర్తన విధానము నిర్ణయించుటకు న్యాయ దర్శనము సిద్ధాంతీకరించబడినది. న్యాయమునందలి విషయాదులను అపవాదమొనర్చుచు సాంఖ్య దర్శనము నిర్ణయింపబడినది. సాంఖ్యమునందలి నిర్మిత విధానములందు అపవాదములను తెలియజేయుచు యోగ దర్శనము నిర్ణయింపబడినది. యోగమునందలి నిర్మిత విధానముల యొక్క ఆచరణమునందు అపవాదము తెలియజేయుచు పూర్వమీమాంసమను కర్మసూత్రములు నిర్ణయింపబడినవి. కర్మసూత్రముల యందలి నిర్మిత విధానమునందు అపవాదములు తెలియజేయుచు ఉత్తరమీమాంసమను బ్రహ్మసూత్రములు నిర్ణయించబడినవి. ఈ షడ్దర్శనములను ఖండించుచు బుద్ధ భగవానుడు బౌద్ధ మతమును స్థాపించినాడు. బౌద్ధ మతమును నిరసన జేయుచు శంకరాచార్యులు అద్వైత మతమును స్థాపించినాడు. అద్వైత మతమును ఖండించుచు రామానుజాచారి విశిష్ఠాద్వైతమును స్థాపించినాడు. ఈ విశిష్ఠాద్వైతమును ఖండించుచు మధ్వాచారి ద్వైతమతమును స్థాపించియున్నాడు. ఈ అద్వైత, విశిష్ఠాద్వైత, ద్వైత మతములు ఈ త్రిమతాచార్యులకు పూర్వము నుండియే వున్ననూ వీరు ప్రస్థానత్రయముకు భాష్య గ్రంథములు వ్రాసి వ్రాసియుండుటచే ఆ యా మత ప్రతిష్ఠాపనాచార్యులుగా పేరొందినారు. ఇదే విధముగా శాక్తేయము గాణాపత్యము, సౌరము, క్రైస్తవము, మహమ్మదీయము మొదలగు మత సిద్ధాంతములు ప్రపంచమున అనేకము కలవు. హిందూ సాంప్రదాయమున వేదోపనిషదాది గ్రంథములపై ఆధారపడి ప్రధానముగా వ్యాప్తి చెందిన త్రిమతములైన ద్వైతాద్వైతవిశిష్ఠాద్వైతముల సారమును తెలుసుకొందాము. ఎందుకనగా? అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము ఆగమనిగమోపనిషత్సాగర మధితార్థము. ఈ త్రిమతముల కన్నా అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము ఏ విధముగా విశిష్ఠమైన మార్గమును జననమరణ భ్రాంతిరాహిత్యము కొరకు సూచిస్తుందో తెలియుట కొరకు వాటిలోని సారమును మరియు వాటియందుగల అపవాదములను తెలిసికొనవలసిన అవసరమున్నది.

1. అద్వైతము: శంకరాచార్యులు (క్రీ.శ. 788 - 820) ఓంకారనాథాశ్రమములో గోవింద భగవత్పాదుల వద్ద అద్వైత సాంప్రదాయానుగుణ్యముగా సేవాసాధనలు చేసి, ఆచార్యుల మెప్పు పొంది, కాశీ నగరమునకు వెళ్ళి, అక్కడ కొంత కాలము శిష్యులకు అద్వైత వేదాంతము బోధించి, అచటి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళి, అచట ప్రస్థానత్రయ భాష్యమును పూర్తిజేసి, ఆ పిమ్మట భారతదేశమంతట పర్యటించి శాస్త్రార్థము చేసి బౌద్ధులను, కాపాలికులను, పూర్వ మీమాంసకులను ఓడించి కొందరిని వైదిక మతానుయాయులనుగా చేసెను.

బ్రహ్మమొక్కటియే సత్యమైనదనీ, అనంత జ్ఞానానంద స్వరూపమైనదనీ, జగత్తు మిథ్యయనీ, జీవుడు తత్వతః బ్రహ్మమేననీ అద్వైతుల సిద్ధాంతము. “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవనా పరః” అని ఈ సిద్ధాంతము ఒక్క శ్లోకార్థములో చెప్పబడినది.

ఋగ్యజుస్సామాధర్వణ వేదములను నాలుగు వేదములనుండి జీవబ్రహ్మలకు లక్షణ త్రయముచే భాగత్యాగ పద్ధతిగా అభేదమును సూచించుచు నాలుగు మహావాక్యములు తీసుకొనబడినవి. ఋగ్వేదము నుండి “ప్రజ్ఞానం బ్రహ్మ”, యజుర్వేదము నుండి “అహం బ్రహ్మాస్మి”, సామవేదము నుండి “తత్వమసి”, అధర్వణవేదము నుండి “అయమాత్మా బ్రహ్మ” అను నాలుగు మహావాక్యములు గ్రహించబడినవి. జీవబ్రహ్మలకు అభేదత్వమును ప్రతిపాదించు ఈ మహావాక్యముల శ్రవణ, మనన, నిధి, ధ్యాసలే జీవబ్రహ్మైక్యమునకు సాధనములుగా నిర్ణయించిరి. శ్రవణ, మనన, నిధి ధ్యాసల వలన బ్రహ్మాపరోక్షానుభవము సిద్ధిస్తుందని అద్వైతుల సిద్ధాంతము. ఎట్లనగా? అఖండానంద రూపమగు చైతన్యము ఒక్కటియే సత్య పదార్థము. అదియే బ్రహ్మము. సకల ప్రపంచమునకు సాక్షిభూతము. నిర్వికారమగు బ్రహ్మమునందు జగద్భ్రాంతి అవిద్యా ప్రభావమున కలుగుచున్నది. అవిద్యను మాయని, ప్రకృతియని అందురు. మాయయగు సత్వగుణమందలి చేతన ప్రతిబింబము, చేతనము, మాయ ఈ మూడు కూడి ఈశ్వరుడు. అవిద్యయగు రజోగుణమునందలి ప్రతిబింబము, చేతనము, అవిద్య ఈ మూడు కూడి జీవుడు. మాయ, అవిద్యోపాధులగు జీవేశ్వరులను తీసివేయగా చేతన బ్రహ్మము శాశ్వతము అని అద్వైత మత నిర్ణయము. మహావాక్యార్థ అనుభవ ప్రాప్తికి రెండు మార్గములు నిర్ణయించబడినవి. 1) సన్యాసాశ్రమ స్వీకారము. 2) శ్రీ విద్యాదీక్ష.

అపవాదము: మాయావాదమగు అద్వైతవాదము అధ్యారోపపవాదములచే ప్రబోధించబడునది. అధ్యారోపపవాదమనగా అధిష్ఠానచేతన బ్రహ్మమునందు ప్రపంచమును కల్పించి లేదని చెప్పడము. వేదాంత రీత్యా బ్రహ్మమనగా స్వయంప్రకాశము. ప్రపంచము గుణత్రయరూపక సత్వరజస్తమోమయము. స్వయంప్రకాశమైన బ్రహ్మమునందు ప్రపంచము కల్పించటము సూర్యునియందు చీకటిని కల్పించినట్లుగనే అపవాదము కలుగుచున్నది. ఇదియునుగాక అద్వైత మతవాదులు బ్రహ్మమునందు ప్రపంచము రజ్జు సర్ప భ్రాంతివంటిదని వాదించెదరు. ఈ దృష్టాంతమందు అపవాదము కలదు. ఎట్టులనగా? రజ్జువు బ్రహ్మమాయెను, సర్పము ప్రపంచమాయెను. ఈ రెంటిని తెలుసుకునేవాడు మూడవవాడై వుండవలయును. కాని ఇందులో రజ్జువు అనే త్రాడు, సర్పమనే భ్రాంతి రెండే తెలియబడుచున్నవి గాని, మూడవది తెలియబడుట లేదు. ఐనను మూడవది బ్రహ్మమని అనుకొన్నను బ్రహ్మము రజ్జువును తెలిసి భ్రమసెనా? తెలియక భ్రమసెనా? రజ్జువని తెలుసుకుంటే భ్రమయే లేదు. ఎరుగక పోతే సర్పమని చెప్పవలెనేగాని భ్రమయని చెప్పగూడదు. కనుక ఎఱిగినను భ్రమ లేదు. ఎరుగకున్నను భ్రమ లేదని తెలియబడుచున్నది. ఇదియునుగాక రజ్జువు తనయందు తాను సర్పముగా భ్రమసెనా? లేక అన్యులు భ్రమసిరా? అని విచారించగా అన్యులు భ్రమసిరని కదా చెప్పవలెను. అట్లు చెప్పిన బ్రహ్మము తనయందు తానే భ్రమసెనని తెలియబడుచున్నది. రజ్జువు తాను పామని భ్రమసెనని అనగూడదు. బ్రహ్మము భ్రమసినదనే వాక్యము వినగూడదు. అసలు పరిపూర్ణ పరబయలుయందు భ్రమరూపమైన ప్రపంచము పుట్టనేలేదు. పుట్టని ప్రపంచము పుట్టినదని నిర్ణయించినందున ఈ మతమునందుగల దృష్టద్రాష్టాంతములన్నింటికి అపవాదములే వచ్చును.

2. విశిష్ఠాద్వైతము: నాథముని, యామున, రామానుజులచే ప్రచారము చేయబడిన మతము విశిష్ఠాద్వైతము. రామానుజాచార్యులు (క్రీ.శ. 1017–1137) హృదయస్థమగు భక్తికి ప్రాధాన్యతను ఇచ్చి సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వసమాన ప్రతిపత్తి నిర్ణయిస్తూ విశిష్ఠాద్వైత మతమును బోధించినాడు. మానవులు జీవితములో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినపుడు, ఆ పరిస్థితుల నుండి రక్షింపబడుటకు ఒక మహత్తర శక్తి మీద ఆధారపడుతారు. కష్టసుఖాలలో శాంతిసౌఖ్యములు చేకూరుటకు శరణు పొంద తగినవాడు, అట్టి మహిమాన్విత శక్తియుక్తులు కలవాడు ఒక్క పరమాత్మయేనని రామానుజాచార్యుల మతము. పారమార్థిక తత్వాన్ని స్పష్టముగా సుబోధకముగా వివరించలేని సిద్ధాంతము మరియు ముఖ్య ప్రవృత్తులను సమర్థించలేని సిద్ధాంతము సామాన్య ప్రజాదరణ పొందబోదు. భగవంతుడు సత్యము, నిత్యము అయివుండి సామాన్య మానవునికి అతీతుడైనా అత్యవసర సమయములలో వెంటవుండి తోడ్పడేవాడు కావలెను. ఆయన మానవునికి తండ్రి, తల్లి, మిత్రుడు, బంధువు, ఆప్తుడుగా వుంటూ మానవునికి అతి సన్నిహితుడుగా వుండవలెను. ఇటువంటి సంబంధము నిరాకార, నిర్గుణ బ్రహ్మములో మానవునకు సంప్రాప్తించదు. కనుక దైవమునందు ఇట్టి సౌలభ్యము వుండిననే మానవునకు ఉపాస్యము లేక ఆరాధ్య దైవము కాగలడు. అట్టి సౌలభ్యము సగుణ, సాకార దైవములోనే సాధ్యము. సాకారమూ, సగుణమూనైన దైవముతో మానవుడు అనేక సంబంధ బాంధవ్యములు కల్పించుకొని శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర, శిశు భావాలతో ఆ దేవదేవుని ఉపాసించి ఇష్టకామ్యార్థ సిద్ధి పొందుచూ ఆనంద హృదయుడు కాగల్గును.

జీవుడు బ్రహ్మమునకు అంశము. బ్రహ్మము జగత్తుగా పరిణమించినది. జగత్తుకు కారణమైన గుణములు కలది బ్రహ్మము. మోక్షమందు జీవునికి జగత్కర్తృత్వాదులు వుండవు. సంరాధన అనగా ధ్యానము, మోక్షమార్గము. బ్రహ్మసూత్రములందు గల సిద్ధాంతములు ఈ మతమునకు ఆధారములు. సమస్తములోను అనగా ఆత్మలయందు, పృథివ్యాదులందు కూడ బ్రహ్మము అంతర్యామిగ వున్నదని చెప్పు శృతి వాక్యములు ఈ మతమునకు ముఖ్య శృతులు. పరమాత్మ, ప్రకృతి, జీవుడు అను మూడు పరస్పర భేదములుగా అనాదిగా, శాశ్వితముగా వుంటూవున్నా ఇవి మూడు బ్రహ్మము యొక్క అంశములే. కావున విశిష్ఠరూపేణ ఐక్యము చెప్పబడి ఈ మతము విశిష్ఠాద్వైతము అని చెప్పబడినది. రామానుజాచార్యులు శంకరాచార్యుల మాయావాదమును పూర్తిగా ఖండించెను. పరమాత్మ, ప్రకృతి, జీవుడు సత్యమైనవని రామానుజాచార్యుల మతాభిప్రాయము.

బ్రహ్మము నారాయణుడు. అతడు కళ్యాణ గుణాశ్రయుడు. సాకారదైవము ప్రేమ, వాత్సల్యము, కృపారసములే స్వరూపముగా కలవాడు. ఈ సాకార దైవము భక్త సులభుడు, కాబట్టి సంసార సమస్యలతో చిత్తచాంచల్యము పొంది మానవుడు తరచు చేసే పొరబాట్లను కనికరముతో క్షమించగలడు. అతడు సమస్త కళ్యాణ గుణాకరుడు. క్షమ కూడా ఆ భగవంతుని గుణము. కనుక భక్తసులభుడుగా నుండు సాకారదైవమే ఉపాసించదగినవాడు. కనుక జ్ఞానమును భక్తికి అంగముగా చేసికొని, ముక్తికి భక్తియే సాధనమని శ్రీ రామానుజాచార్యులు బోధించినారు. నిర్గుణ బ్రహ్మమునందు భక్తి ఉపాసనలు ఎట్లు సాధ్యము? శ్రీ మహావిష్ణువే సాకార బ్రహ్మము. సతత ధ్యానముచే నారాయణుడు విశదతమముగా ప్రత్యక్షమగుటయే బ్రహ్మానుభవము, బ్రహ్మ వేదనము. అర్చనవందనాది సేవ భక్తి యొక్క రూపములు. ఆయన యందలి భక్తిచే సాలోక్య, సామీప్యాది ముక్తులు సులభంగా ప్రాప్తించును. ఇది విశిష్ఠాద్వైత మతాభిప్రాయము.

అపవాదము: భగవంతుడైన శ్రీ మహా విష్ణువు యొక్క విగ్రహములకు బాల భోగములు, రాజభోగములు, పవళింపు సేవలు జరుపుచూ, తాము కూడా అట్టి భోగపరాయణులై వాటిని అనుసరించుట వలన విశిష్ఠాద్వైతము హీన స్థాయికి వచ్చెను. భగవంతునియందు భక్తిప్రతిపత్తులు లేకుండా పోయి, విధినిషేధములు అడుగంటి అధర్మము ప్రబలి, సమాజ శ్రేయస్సుకు ఘోర ప్రమాదము వాటిల్లెను. నారాయణుని ఉపాసనచే జీవుడు ఎక్కడో వున్న లోకాలలో నారాయణుని సాన్నిధ్యముచేరి ముక్తి పొందుతాడనేది పరతంత్రముగానే వున్నదిగాని స్వతంత్రముగా లేదు. జీవుడు పూర్తిగా భగవంతుని కృప పై ఆధారపడుతాడు. ఇది “ఉద్ధరేదాత్మనాత్మానం” అని చెప్పబడిన సిద్ధాంతమునకు వ్యతిరిక్తముగానున్నది. “ఆబ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున” అను పద్ధతిచే ఏ యే లోకాలకు వెళ్ళిననూ తిరిగి మర్త్యలోకమునకు వచ్చే విధానముగా వున్నందున విశిష్ఠాద్వైత ప్రతిపాదితమైన ముక్తి శాశ్వితమైనది కాదని తెలియబడినది. వస్తుతః సర్వమూ పరమాత్మయే. తాను వేరు, పరమాత్మ వేరు లేడు. పరిపూర్ణ గురు కృపచే అఖండరూప అధిష్ఠానచేతన బ్రహ్మము యొక్క నిర్ణయమును తెలిసికొనినచో తాను ఆ పరమాత్మ స్వరూపుడేగాని అన్యుడుగాడు. ఈ అభేదత్వమును జ్ఞాన, కర్మల ద్వారా సమన్వయము చేయుటయే ఏకాంత భక్తి. “శ్లో || ఉదారాస్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం| ఆస్థితస్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం ||” అనగా జ్ఞానికి నాకు భేదము లేదు అని శ్రీ కృష్ణ పరమాత్మ దీనినే ప్రవచించెను. కనుక విశిష్ఠాద్వైత ప్రతిపాదితమైన భక్తిప్రతిపత్తులు పరతంత్ర పద్ధతి కలిగి మానవుని ఔన్నత్యమును దిగజార్చుచున్నవని తెలియబడుచున్నది.

3. ద్వైతము: మధ్వాచార్యులు (క్రీ.శ. 1238-1317) శంకరాచార్యుల మతమును పూర్తిగా ఖండిస్తూ కొన్ని విషయములలో విశిష్ఠాద్వైతమును సమర్థిస్తూ అందుకు తగిన కొన్ని శాస్త్ర, పురాణ ప్రమాణములను ఆధారంగా తీసుకొని జీవబ్రహ్మలకు అత్యంత విభిన్నత్వమును ప్రతిపాదించి, అందుకు తగిన పటిష్టమైన తార్కిక వాదనలతో స్థిరపరచిన వేదాంత శాఖయే ద్వైత మతము పేర ప్రసిద్ధమై వున్నది. ఈ మతమున అభిన్నత్వము పూర్తిగా పరిహరింపబడి, తాత్వికముగ పరస్పర భిన్నత్వమే సిద్ధాంతము చేయబడినది.

1) భగవంతునికి జీవునికి భేదము
2) భగవంతునికి జడ ప్రకృతికి భేదము
3) జీవునికి జీవునికి భేదము
4) జీవునికి ప్రపంచమునకు భేదము
5) ప్రపంచములోని జడ పదార్థములలో పరస్పర భేదము.

ఈ అయిదు విధములుగా భేదము నిరూపించబడినది. మధ్వ ప్రతిపాదితమగు బ్రహ్మము నిర్విశేషము కాదు. కేవలము సవిశేషము. ఈ మతమునందు జీవ బ్రహ్మములు రెండు భిన్నములు. సగుణబ్రహ్మమగు ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణ శోభితుడు. జీవుడు అల్పగుణ విశిష్ఠుడు. కాని జీవేశ్వరులు ఇద్దరూ చిత్స్వరూపులే. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అను మూడింటిని అనాదులుగా నిర్ణయించిరి. జీవుడు అణుస్వరూపుడు. ఈశ్వరుడు విభువు అనగా సర్వవ్యాపి. ఈ సిద్ధాంతములో ముక్తి అంటే జీవుడు అన్య రూపమును వదలి తన స్వరూపములో భగవంతుని సాన్నిధ్యములో ఆయన నివసించే స్థానములో వుండడమేగాని సారూప్యాది ముక్తులేమియూ ఆయన అంగీకరించలేదు. భగవంతునిలో ఐక్యము పొందడము అసలే సంభవము కాదు. భగవంతునికీ జీవునికీ హస్తిమశకాంతర భేదము కలదని ద్వైత మత సిద్ధాంతము. వేదవిహిత కర్మాచరణ ద్వారా జీవుడు పరిశుద్ధి చెందగలడని కర్మ ప్రాముఖ్యతను బోధించినాడు. మానవుడెన్నడూ మాధవుడు కాజాలడు. భగవంతుడు ప్రభువు, జీవుడు కేవలము కింకరుడు (దాసుడు) మాత్రమే అని ద్వైత మత సిద్ధాంతము.

అపవాదము: “ఏకోహం బహుస్యాం” అను న్యాయమున బ్రహ్మము ఒక్కటియే పరస్పర భేదములుగల జీవేశ్వరజగత్తులుగాను, సర్వజ్ఞత్వ-కించిజ్ఞత్వములుగాను పరిణామము చెందినప్పటికిని వస్తుతః బ్రహ్మ పదార్థమేగాని అన్యము గాదు. కనుక “సర్వం ఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన” అను శృతిని అనుసరించి జీవేశ్వరులకు భేదము లేదు. జీవేశ్వరజగత్తులు అఖండరూప అధిష్ఠాన బ్రహ్మమునందు తోచబడుచున్నవి. తత్వతః సర్వమూ బ్రహ్మమే. “విశ్వం వ్యాప్నోతి ఇతి విష్ణుః” అను శృతిని అనుసరించి, విష్ణువు సర్వమునందు వ్యాపించి వుండుటచే ఆయనకు ఒక లోకమును ప్రతిపాదించుట సరియైన విధానము కాదు. కర్మ, భక్తి పద్ధతులను ఆచరించుచు ఎక్కడో విష్ణువు వున్నాడని, తనను ఆయన లోకానికి తీసుకుపోతాడనుకొని కింకరత్వము వహించుట వల్ల మానవ విశిష్ఠత కోల్పోయి “క్షీణే పుణ్యే మర్త్య లోకం విశన్తి” అను న్యాయమున అధోపతనమగుచున్నాడు.

వేదాంత భాగమునందుగల పరమాత్మ నిర్ణయమునకు అనేక మతములు నిర్ణయింపబడి వాదోపవాదములచే సిద్ధాంతముల పై సిద్ధాంతములు చేయబడినవి. ఇంకనూ చేయుచూనే వున్నారు. ఒకరి సిద్ధాంతము కన్న ఇంకొకరి సిద్ధాంతము బలమైనదిగా తోచునప్పుడు పూర్వ సిద్ధాంతమును త్రోసివేసి నవీన సిద్ధాంతములను ఆచరించెదరు. ఎట్టులనగా? ఒక దేశస్థులు పరమేశ్వర ఆరాధనపరులు శైవులుగాను, ఇంకొక దేశస్థులు శ్రీమన్నారాయణ ఆరాధనపరులు వైష్ణవులుగాను వుండి ఒకప్పుడు యుద్ధములు జరుపుకొని వారి దేశము వీరు జయించినట్లుగా, శైవుల పరమేశ్వరుడు అధికుడుగాను వైష్ణవుల నారాయణుడు భృత్యుడుగాను మరియు వీరి దేశమునే వారు జయించినట్టుగా, శ్రీమన్నారాయణుడే బలవంతుడుగాను, సత్యవంతుడుగాను శైవుల పరమేశ్వరుడే దాసుడుగాను నిర్ణయించి ఆచరించుచుందురు. అదే విధముగా ఒక మతకర్త పైన ఇంకొక మతకర్త వాక్చతురతచే అతనిని ఓడించి తన మతమును సిద్ధాంత పరచును, పూర్వ మతమును అణచివేయును. ఆ మతకర్త సజీవముగా వున్నంత వరకు ఆ మతము పోషింపబడి దిగ్విజయము చెందినట్లుగా తెలియబడుచుండును. కాని మతకర్త యొక్క మరణానంతరము మతాభిప్రాయములు ఇతర మతకర్తలచే అపవాదమొనర్చబడి నూతన మతము సిద్ధాంతీకరించబడును.

అద్వైత మతము, విశిష్ఠాద్వైత మతము, ద్వైత మతము అను మతములు ఆస్తిక మతములని చెప్పుటకు కారణమేమనగా? వేదశిరస్సులగు ఉపనిషత్తులకు, సర్వవేదాంత సారమగు భగవద్గీతాది ప్రకరణ గ్రంథములకు మతకర్తలు శంకర భాష్యమని, రామానుజ భాష్యమని, మధ్వ భాష్యమని వ్యాఖ్యానమొనర్చియున్నారు. ఈ భాష్యములు ఒకదానికొకటి విరుద్ధముగా వుండుట వలన వేదవేదాంతసిద్ధాంతమునందలి వారి అభిప్రాయములు మారేడుగాయకు మసిబూసిన అది ఏ కాయనో తెలియక యుండునట్లుగా వేదవేదాంతసిద్ధాంతమునందలి సత్యస్వరూపము మరుగున పడి ఉన్నది. “హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి హితం ముఖం”. బంగారు పాత్రలో దాచబడిన సత్యమును చూడాల్సి వుండగా బంగారు పాత్ర యొక్క తళుకులకే మతకర్తలు మరిన్ని రంగులు పూసి తాము భ్రమ పడుచూ ఇతరులను భ్రమింప చేయుచున్నారనుటలో సంశయము లేదు. అనగా హిరణ్మయ కోశమునకు అతీతమైన అచల పరిపూర్ణ బ్రహ్మమే సత్యమైనదని తెలిసికొనవలసి వుండగా బంగారు పాత్ర వలె వున్న ఎఱుకకే మ్రగ్గుచున్నారు మతవాదులు.

ఈ మూడు మతములేగాక జైనము, బౌద్ధము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, సిక్కు, క్రైస్తవము, యూదు, మహమ్మదీయము, జొరాస్ట్రినిజం, స్పిరిటిజం, కన్ఫ్యూసియనిజం, షింతొ, టావో మొదలగు అనేక మతములు ప్రపంచమున కలవు. అంతేగాక బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, బ్రహ్మ కుమారి ఈశ్వరీయ సమాజము మొదలగు అనేక అను సంస్థలును; ఆర్ట్ ఆఫ్ లివింగ్, పాతంజలి యోగ సంబంధ సంస్థలును; ఇస్కాన్, జీయర్ సంస్థలును; దత్త పీఠాదులును మొదలగు అనేక రకముల ధ్యాన కేంద్రములును ప్రపంచమున కలవు. హిందువుల పుణ్య క్షేత్రములగు కాశి రామేశ్వరాదులు మొదలగు అనేక యాత్రా స్థలములు , క్రైస్తవుల పుణ్య క్షేత్రములగు జెరూసలేం, వాటికన్ మొదలగు పట్టణములును, మహమ్మదీయుల పుణ్య క్షేత్రమగు మక్కాయను పవిత్ర స్థలమును ప్రపంచమున కలవు. అయ్యప్ప దీక్షా పరులును, హనుమాన్ దీక్షా పరులును, సంతోషిమాత దీక్షా పరులును, సరస్వతి దీక్షా పరులును, సాయి భక్తులును మొదలగు భక్త సమాజముల వారును లోకమున కలరు. జ్యోతిష్య శాస్త్ర వాదులును, వాస్తు శాస్త్ర వాదులును, యంత్ర, తంత్ర, మంత్ర వాదులును ప్రజలకు కలుగుచున్న కష్టనష్టముల గూర్చి పరిశోధించి తదనుగుణమైన సహాయ రూపమైన సలహాలను, చికిత్సలను అందించుచున్నారు. మరియు మానవుడు ఎంత వరకు బ్రహ్మతత్వమును విచారించుచుండునో అంత వరకు ఈ మతాది విషయములు నవీన విధానములుగా తెలియబడుచూనే వుండును. ఎందుకనగా? ఈ ప్రకృతి విధానమగు భౌతిక ప్రపంచము అంతఃకరణమునకు భ్రాంతి జనకముగా వున్నందున శృతి|| “ఆశయా బద్ధతే లోకే” || అను సూత్రమును అనుసరించి మానవలోకము యొక్క అంతఃకరణములను ఆశయనే పిశాచము ఆవరించి వున్నందున మానవులు ఆశకు బద్ధులై వున్నారు. ఎట్లనగా? ఏ మతమునందున లేక ఏ సంస్థయందున ప్రవేశించిన తనకు అష్టైశ్వర్యములు కలిగి సుఖముగా వుండగలమనే భ్రాంతి కొందరికి, మంత్రోపాసన వల్ల మంత్రాధిష్ఠాన దేవతను వశపర్చుకొని తమకుగల కోరికలను సిద్ధించుకోగలమనే ఆశ కొందరికి, ఏ నదిలో మునిగితె తన పాపాలు పోవునని కొందరికి, ఏ క్షేత్రమునకు పోయి ఏ దేవునికి మ్రొక్కితె తన అభీష్టము నెరవేరగలదని మరికొందరికి, మరియు అద్వైతులు బ్రహ్మమునందు ఐక్యము చెందగలమని, విశిష్ఠాద్వైతులు సామీప్య పదవులు అనుభవించగలమని, ద్వైతులు సాలోక్యానుభవము చెందగలమని, యోగీశ్వరులు జీవేశ్వరైక్యము పొందుచున్నామని భ్రాంతియందు చిక్కి శృతి|| “కర్మణా బహు చింతయా”|| అనే న్యాయమున తేనెయందు పడిన ఈగవలె వేదవేదాంత మత నిర్మిత పద్ధతులయందు చిక్కుకొని అల్లాడుచున్నారు. కనుక ఈ విధానముల వలన మానవులకు అంతఃకరణ విశ్రాంతిలేక భ్రాంతియనే తేనెయందు పడి కొట్టుకొనుచున్నారు. జననమరణ భ్రాంతి రహిత పద్ధతిని తెలిసికొన కోరిక కలవారు వేదవేదాంతసిద్ధాంతములగు నిర్మిత గ్రంథరాజములను స్వతంత్రముగా విచారించి భ్రాంతిరహిత సాంప్రదాయక నిజగురువులగు అచల పరిపూర్ణ సద్గురువులచే పరిపూర్ణ ప్రబోధ విని, కని, పరిపూర్ణస్థితిని పొందవలయును; కాని మతకర్తల యొక్క వ్యాఖ్యానములయందు చిక్కుకొనిన యెడల తేనెలో పడిన తేనెటీగ ఏ పద్ధతిగా మరణావస్థ చెందగలదో ఆ పద్ధతిగా మతప్రబోధకుల విధానమును నమ్మి యున్నవారు భ్రాంతి విధానమును చెందగలరని, అభిమానరహిత విధానమగు అమృత దృష్టి యందే మానవలోక కళ్యాణమగు విశ్వమానవ సౌభ్రాతృత్వము, అన్యోన్య సహకారము, ఐహికాముష్మిక పురోభివృద్ధి వుండగలదని గ్రహించవలసి వుండును. కనుక భ్రాంతి రహిత విధానమునకు మానవులు సిద్ధాంత భాగమును తెలుసుకోవలయును. దీని వల్లనే మానవాళి యొక్క అంతఃకరణము నిర్మలమై భ్రాంతిరహిత స్థితియందు వుండును. వేదవేదాంతమత పద్ధతుల యందు మానవ లోకమునకు ఏలాంటి ఆనందదాయకము లేదని కొంత వరకు మీకు తెలిసి వున్నను ఈ వ్యాసమునందు తెలియజేసిన విధానమును పరిపూర్ణ గురు కృపచే ఉన్నది వున్నట్లు, లేనిది లేనట్లు గ్రహించినచో వేదవేదాంతమునందలి తత్వ విచారణలో ఆ యా మత ప్రవక్తలు భ్రాంతి చెంది చేసిన పరస్పరభేదములైన మత నిర్ణయములందలి అపవాదములు విస్పష్టముగా తెలియబడగలవు.
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to వ్యాస రచనలు

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron