ఎరుకే జడాజడములు

చమత్కార/హాస్య వ్యాసాలు, పరిశోధనాత్మక/సందేశాత్మ/విమర్శాత్మక వ్యాసాలు .... అన్ని రకాల తెలుగు వ్యాస రచనలు - మీ స్వీయ రచనలు లేదా మీ అభిమాన వ్యాసరచయిత వ్యాసాలు (మీ వ్యాఖ్యానంతో), వాటి మీద చర్చలూ!

ఎరుకే జడాజడములు

Postby Dr.Rapelli_Sridhar » Thu Feb 15, 2018 11:17 pm

ఎరుకే జడాజడములు
Dr. Sridhar Rapelli, New York, USA.

మేను జడ మజడమనినను
నేనును యీ రెండు గలసి నేననబడు స్వ
ప్నానందమె మదవస్థగు
నేనే నను మృషని తెలియ నే మృష నౌదున్! ||
(55వ కందపద్యము)

భావము: మేను అనగా పాంచభౌతికమైన శరీరము. ఇది జడము అని నిర్ణయము. అనగా తెలివి లేనిదని అర్థము. నేను అనగా చేతనము. అనగా తెలివి. కనుక నేను అనునది అజడమని నిర్ణయము. కాని ఈ రెండు విడదీయలేనివి. అనగా ఈ రెండు వేర్వేరుగా లేవు. ఇవి రెండు ఒకదానియందు ఒకటి పడుగుపేకలవలె ఓతప్రోతములై వున్నవి. ఉదాహరణకు బెల్లపు గడ్డను విడిచి తీపిగాని, తీపిని విడిచి బెల్లపుగడ్డగాని లేవు. చేతనము, శరీరము అను రెండు గలసివున్న పదార్థమునకే "నేను" అని పేరు. చేతనములేని (ప్రాణములేని ) శరీరము శవమనబడును. అది జడమైపడివుండును. కదులదు, మాటలాడదు. శరీరములేని చేతనము వ్యవహారము చేయలేదు. కనుక శివశక్తులుగా గలసివున్న జీవియే "నేను", "నేను" అని అనుచు వ్యవహరించును. తన పూర్ణస్వరూపమును తెలిసికొనగా సకలము విరాడ్రూపశరీరమునందు ఒకే తనువుగా తెలియబడి, తానే ఒక స్వప్నమని, అదియే స్వప్నానందముగా తెలియబడి, అది స్వప్నావస్థయేగాని మరొకటిగాదని తెలిసి, తానే మృషయని తెలిసిన, తానే లేడు.

ఎరుక జడమజడమీ జగ
మరయగ పరిపూర్ణమేమి యనరానిది యా
యెరుకజగములస్థిరములు
పరిపూర్ణము శాశ్వతపుది || పాటించి కనరా కావా రెండీ పాటివి వినరా ||
గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో
తిరిగి పుట్టడు వాడీ ధరపై మునిపటివలె || పాటించి కనరా కావా రెండీ పాటివి వినరా || (70వ కందార్థ దర్వు)

భావము: సృష్టికి పూర్వమున్న బ్రహ్మపదార్థమును "ఎరుక" అని అంటాము. ఆ ఎరుక జడాజడములుగానున్నది. ఆ జడాజడముల యెరుకయే జగముగాను భాసిల్లుచున్నది. జడమును విడచి అజడము, అజడమును విడచి జడము లేదు. రెండు ద్వంద్వపద్ధతిగా కనిపించుచున్ననూ ఏకమే. ఆ ఏకమైన జడాజడ పదార్థమే జగముగా పరిణామము చెందెను. సృష్టికి కారణమైన పదార్థము, జీవేశ్వరజగదోపాధి కూడ జడచేతనములతో కూడుకొని వున్నదే. జగత్తుగా మారక ముందు ఆ ఎరుక బిందురూపములో జడాజడరూపముగా నున్నది. సృష్టికి కారణభూతమైన బిందురూపమైన ఎరుక ప్రకృతిపురుషులుగా నున్నది. ఇందు పురుషుడు చేతనముగా (అజడముగాను), ప్రకృతిని జడముగాను విభాగించి తెలియవలెను. ప్రకృతిపురుషులు వేర్వేరుగా లేరు. పురుషునియందు ప్రకృతి, ప్రకృతియందు పురుషుడు ఓతప్రోతములయ్యే వున్నారు. ఆ జడాజడములుగానున్న ప్రకృతిపురుషులే జగముగా పరిణమించిరి. ఆ జగము కూడ జడాజడములతో నిండియున్నది. విత్తులో వున్న లక్షణములే వృక్షమునందు అగుపించును కదా? సృష్టికి పూర్వమున్న బ్రహ్మాండము బిందురూపముగా తెలియుచున్ననూ అందులో నాదము వున్నది. ఆ నాదముయందు కళయున్నది. ఆ బిందువులో చేతనము, పదార్థము(శక్తి) కలసియే వున్నవి.

బిందువు నాదముగాను, నాదము కళగాను పరిణమించెను. నాదము తరంగరూపము. బిందువు నాదముగాను, నాదము బిందువుగాను తోచుచుండును. కళ అనునది ప్రకాశరూపము. నాదమునందు, కళయందు కూడ జడచేతనములు కలసియేవుండును.పదార్థము స్థూల దృష్టికి పదార్థముగాను, సూక్ష్మ దృష్టికి శక్తిగాను కనిపించును. నిరంతరము ఈ జగత్తులో పదార్థము శక్తిగాను, శక్తి పదార్థముగాను మారుచున్నది. పదార్థములోనూ, శక్తిలోనూ చేతనము విడదీయరాకుండా నున్నది. స్థూల దృష్టికి పదార్థము జడముగా కనిపించుచున్ననూ, సూక్ష్మ దృష్టికి అంతరములో చేతనము నిండియే వున్నది. ఉదాహరణకు బెల్లపుగడ్డలో తీపి వున్నట్లు. బెల్లపుగడ్డను పదార్థముగాను, తీపిని చేతనముగాను తెలియవలెను.

జాగ్రదావస్థలో నున్న మానవునియందు చేతనము తెలివిరూపముగా నుండి అజడపద్ధతిగా నుండును, అదే తెలివి నిద్రావస్థలో మరుపురూపకముగా నుండి జడపద్ధతిలో నున్నట్లు తెలియబడినప్పటికి, ఆ తెలివి ఇంకొకరూపములో తాను తిన్నటువంటి అన్నమును జీర్ణింపజేసి శరీరములో సప్తధాతువులుగా మార్చుచూ సహాయకారిగా నుండి అజడపద్ధతిగా తెలియబడుచున్నది. జాగ్రదావస్థలో వున్నప్పుడు కూడ మానవుడు ఒక్కొక్కసారి మరుపునకు గురియై జడరూపునిగా నుండును. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే. ఈ విధముగా జడములో అజడము, అజడములో జడము కనబడుచున్నది.

ప్రపంచ సృష్టి తర్వాత, ప్రపంచమునందున్న ఎరుకను తెలివిగా తెలియవలెను. ఎరిగేటిది ఎరుకగా చెప్పినారు గనుక. కనుక ఎరుక అజడము. కాని జగత్తు జడము. అనగా జగత్తునకు స్వతహాగా తెలిసికొనే తెలివిలేదు. కాని విచారించి చూడగా జడాజడములు కలిసియే వున్నవి. అజడమే జడముగాను, జడమే అజడముగాను మారుచున్నది.జగము అనగా జనించి గతించునది. దానినే జగత్తు, లేక జగతి అని అందురు. జగత్తు అనగా పుట్టిచచ్చేది. పుట్టిచచ్చేది పంచభూతాలు మరియు వాటినుండైన శరీరాలు. బ్రహ్మపదార్థము యొక్క స్థూలరూప పరిణామమే జగత్తు. సూక్ష్మంగా విత్తులో దాగివున్న లక్షణాలన్నియు వృక్షమునందు స్థూలరూపమైనట్లుగా, బ్రహ్మపదార్థమను ఎరుకయందు దాగివున్న జడాజడలక్షణములు జగత్తునందు కనిపించుచున్నవి. ఒక్కటేయైన బ్రహ్మపదార్థమునందు విభాగించి చూచుకొనగా, అందు పురుషుడు చైతన్యరూపకముగాను, ప్రకృతి శక్తిరూపకముగాను అనగా పదార్థ రూపకముగాను అవగతమగుచున్నది. పురుషున్ని నిమిత్తకారణముగాను, ప్రకృతిని ఉపాదాన కారణంగాను తెలిసికోవాలి.ఇచట పురుషుడు చేతనముగాను, ప్రకృతి జడముగాను తెలియవలెను. పురుషునికి ప్రకృత్యావరణము వున్నదని నిర్ణయము. ఈ పురుషప్రకృతులు ఈశ్వరునిగాను, మాయగాను పరిణమించెను. ఇందు ఈశ్వరునికి మాయావరణము చెప్పబడినది. మాయ జడము, ఈశ్వరుడు చేతనము. ఈ ఈశ్వరమాయోపాధి నుండి జీవులు ఏర్పడిరి. జీవునికి అవిద్యావరణము వున్నదని నిర్ణయము. ఇందు అవిద్య అనునది జడము, జీవుడనే వాడు చేతనము.

ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు. పుట్టిచచ్చేది జడపదార్థమేగాని, అజడమైన చైతన్యము కాదు. కాని విచారించి చూడగా, శరీరాన్ని విడిచి ఆత్మలేదు, ఆత్మను విడిచి శరీరము లేదు. శరీరము జడము, ఆత్మ అజడము అని నిర్ణయరూపకంగా వున్ననూ, సర్వ ప్రపంచము జడాజడాత్మకమైనదేగాని, వేరొకటి కాదని తేటతెల్లము అవుతోంది. సృష్టి కాక మునుపు వున్న బ్రహ్మపదార్థమునందు ఎరుకరూపముగానున్న తెలివి సూక్ష్మరూపములో వుండియేవుంది. దానికి అభిన్నమై, దానిని ఆవరించిన పదార్థము జడమై అనగా తెలివిరహితమై వున్నది. సృష్టికి పూర్వము శుద్ధచైతన్యమే (అజడమే ) వుంటే దానికి సృష్టి చేయుటకు ఒక పదార్థము ఎచటి నుండి వచ్చెను? కనుక పదార్థము తప్పని సరిగా అవసరమై వుండును. నిమిత్తోపాదానకారణములు సృష్టికి కారణమైన దానియందు లేనిచో సృష్టి జరుగదు. కుండలు తయారగుటకు కుమ్మరివాడు, మట్టి రెండూ అవసరమే. కనుక ఆ పదార్థము చైతన్యమును వీడి యుండుటకు అవకాశము లేదు. ఆ పదార్థమునందు తెలివి, తెలివియందు పదార్థము ఓతప్రోతములయ్యే వున్నవి. ఐననూ పదార్థము ఆవరణరూపముగా అగుపించును. కనుక జడాజడములు బెల్లపు గడ్డ మరియు దానిలోని తీపి కలిసియే వున్నటుల ఒకదానినొకటి విడచి లేవు. పృథ్వ్యాది పంచభూతములు జడములుగా కనిపించుచున్ననూ, వాటిలోని గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద తన్మాత్రలు చైతన్యరూపముగా వుండుటవల్లనే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములను పనులు జరుగుచున్నవి.

విశ్వనిర్మాణమునకు అవసరమైన ప్లాను మొట్టమొదట ఎక్కడ దాగి వుండెను? ఆ ప్లాను సృష్టికి పూర్వమున్న ఆత్మయందే దాగివుండెనని చెప్పక తప్పదు. ఆత్మయను ఎరుక జడమైనచో ఈ విశ్వనిర్మాణమునకు అవసరమైన ప్లాను తాను వేయలేదు. అందువలన తాను సృష్టి రచన చేయలేదు. కనుక సృష్టి రచన చేయుటకు తప్పనిసరిగా ఆత్మ వద్ద విశ్వరచనకు అవసరమైన ప్లాను వుండి తీరవలసినదే. విశ్వోత్పత్తి జరుగుటకు కావలసిన సంకల్పము అను కదలిక ఆత్మయందే కలదు. కనుక ఆత్మ చేతనమేగాని జడపదార్థమని చెప్పగూడదు. తాను జడమైనచో సృష్టిరచనకు అవసరమైన విజ్ఞానము తనకు ఎలా కలిగెను? కలుగదు. కనుక ఆ ఆత్మ అలానే జడపదార్థము వలె పడియుండవలెను. కాని సృష్టి జరిగినదని అనుకొంటే, తప్పనిసరిగా ఆత్మను అజడమని తీర్మానించనైనది. ఆ అజడమైన ఆత్మకు భిన్నముగాక జడపదార్థమో, శక్తియో సృష్టి రచనకు అవసరమై వుండనే వున్నది. కనుకనే ఎరుకే జడాజడములు అని తీర్మానించనైనది.
ఇంకా సూక్ష్మముగా విచారిస్తే జగమునకు కారణము పురుషప్రకృతులు. ఇందులో ప్రకృతి పురుషునికి లోబడియుండును. ఎందుకనగా పురుషుడు చైతన్యము, ప్రకృతి శక్తి లేక పదార్థము. శక్తి లేక పదార్థము ఎల్లప్పుడు చైతన్యము యొక్క అధ్యక్షతలో పనిచేయును. చైతన్యము లేకుండా పదార్థమునుండి సృష్టి జరగదు. సృష్టియందు ఆ ప్రకృతిపురుషులే జగత్తుగా మారుతారు. ఆ జగత్తులో కూడ వివిధ పదార్థాలలో తెలివి వున్నది. జీవ పరిణామము జరిగి జలచరోపాధి నుండి క్రమక్రమముగా మానవోపాధికి వచ్చిన మానవుడు, విశ్వపరిశోధన చేసి సంపూర్ణమైన విజ్ఞానమును పొంది, తనయొక్క నిజస్వరూపమును తెలియుచున్నాడు. ఎరుకజగముల యొక్క పూర్ణ స్వరూపము తెలిసికొన్నచో ఎరుకయే జగత్తుకు కారణమని తెలియబడును. ఆ జగత్తే ప్రళయమునందు సూక్ష్మ పదార్థముగా మారగలదు. ఆ సూక్ష్మమైన పదార్థము ఎరుక రూపముగా తెలియవలెను. ఆ సూక్ష్మ పదార్థము అలాగే వుండక, మళ్ళీ స్థూలమై జగద్రూపముగా మారగలదు. ఇవి రెండు అవస్థలు. సూక్ష్మావస్థగా వున్నప్పుడు ఎరుకగానూ, స్థూలావస్థగా వున్నప్పుడు జగత్తుగానూ నిర్ణయము. ఇలా రెండు అవస్థలుగా మారుచున్నందున ఎరుక, జగము రెండూ కూడ అస్థిరములని చెప్పబడినవి. కాని పరిపూర్ణమునకు ఈ రెండు అవస్థలు లేవు. పరిపూర్ణము జడాజడప్రపంచరూపము కానిది. దానియందు ప్రపంచము పుట్టనే లేదు. దానిలో ఎటువంటి మార్పులు లేవు. అది ఎల్లకాలములయందు స్థిరమై వున్నది. అది శాశ్వతపుది.

ఆరోగ్యము సరిగా లేక చైతన్య విహీనమైన మానవునికి రాతిబస్మమును మందుగా ఇచ్చినచో చైతన్యవంతుడుగా మారుచుండుట లోకమునందు తెలిసిన విషయమే. కనుక రాతిలో చైతన్యము దాగి వుందని చెప్పక తప్పదు. అదియునుగాక, రాళ్ళు, కొండలు మొదలగునవి తెలివిలేని వాటిగా, జడపదార్థములుగా కనిపించుచున్ననూ వాటిలోనూ తెలివి వున్నదనియూ చైతన్యమున్నదనియూ తెలియబడుచున్నది. ఎట్టులనగా? రాళ్ళలో నున్న అణువులన్నియు అతిసూక్ష్మమైన ప్రోటానులు, న్యూట్రానులు, ఎలక్ట్రానులు అను అతిసూక్ష్మమైన మౌలిక కణాలను కలిగివున్నాయి. వాటిలో నున్నది కదలుచున్న శక్తి, ఆ శక్తికి అంతరంగా తెలివి వున్నది. తెలివిలేనిచో ఎంత పెద్దశక్తియైననూ కదులదు దానికదే. ఎంత పెద్ద రైస్ మిల్ వున్ననూ, దానిలో యంత్రాలన్నియు సిద్ధముగా వున్ననూ, కరెంటు వున్ననూ ఒక చైతన్యవంతమైన మానవుడు (జడాజడములతో కూడిన మానవుడు - అనగా ఇచట మానవుడి జరీరము జడము, అతనిలో నున్న తెలివి అజడమైన చైతన్యము) ఒక బటన్ పై వేలు పెట్టి నొక్కితేనే ఆ మిల్ మొత్తము పనిచేయనారంభించును. లేనిచో జడపదార్థముగా పడియుండును. (ఇచట ఒక్క శుద్ధచైతన్యమే వెళ్ళి ఆ మిల్లును పనిచేయునట్లు చేయలేదని గమనించవలెను) అటులనే జడాజడస్వరూపమైన ఎరుక తాను కదలుచూ, తనయందున్న సర్వమును కదలింపజేయుచున్నది. ఇందులో కొన్ని పదార్థములు కదలనట్లు అనిపించినను అన్నియూ కదులుచున్నవే. విజ్ఞాన నేత్రమునకు ఈ సృష్టిలో కదలిక లేనిదేదియూ లేదు. అంతయూ కదలుచూనే వున్నది. సర్వము చలనరూపమే. పరమాణువు కన్నా సూక్ష్మమైన అతిసూక్ష్మ మౌలిక కణము మొదలుకొని బ్రహ్మాండముల వరకు సర్వము జడాజడములే. జడమును విడిచి అజడము లేదు, అజడమును విడిచి జడము లేదు. జడాజడములు ఏకమే.

సృష్ట్యాదిలో సృష్టికి కారణభూతమైన పదార్థము బిందురూపములో నుండెను. ఆ బిందువులో సర్వసృష్టియొక్క చిత్రము సూక్ష్మాతిసూక్ష్మముగా నిక్షిప్తమై వుండెను. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన బిందువు క్రమక్రమముగా స్థూలమై అనంతరూపమా అన్నట్లుగా నేడు విశ్వరూపమున కనిపించుచున్నది. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన బిందువులో దాగివున్న అతిసూక్ష్మమైన ఆకాశము నేడు కాంతిసంవత్సరముల దూరము వరకు సాగి వున్నటుల తెలియబడుచున్నది. ఇంకా ఆ ఆకాశము క్షణక్షణము సాగుతూనే వున్నది. ఎందుకనగా అనేకానేక పాలపుంతలు విశ్వకేంద్రము నుండి దూరంగా పోవుచున్నవి గనుక. కనుక ఈ విధముగా ఆకాశము నిరంతరము వ్యాకోచిస్తూ వున్నదనియూ, ఆ వ్యాకోచించే వస్తువునకే సంకోచలక్షణము తప్పక వుండగలదనియూ, ఆ అనంతరూపమా అనునట్లుగా తెలియబడుచున్న ఆకాశము విశ్వప్రళయమునందు మళ్ళీ బింద్వాకాశముగా మారగలదనియూ తెలియబడుచున్నది. కనుక ఈ విధముగా ఆకాశము సంకోచవ్యాకోచములను గలిగి కదులుచున్నట్లుగాను సూక్ష్మదృష్టికి గోచరమగుచున్నది.

బ్రహ్మాండములో ఒక్క ఆకాశమే కదులని పదార్థముగా అనిపించును. కాని సూక్ష్మ దృష్టికి ఆకాశము కూడ తరంగరూపమే. అది అన్ని వస్తువులకు అవకాశమునిస్తున్నది. కనుకనే ఆకాశమునకు అవకాశమునిచ్చుట కర్మమనియు, బయలుగానుండుట ధర్మమనియు నిర్ణయము. ఆకాశము కదలుకుండ గోడపెట్టినట్లున్నచో ఆ ఆకాశములో గ్రహమండలాదులు ఎలా కదలుచున్నవి? నిజానికి ఆకాశమే ఆకర్షణ శక్తిచే తాను తరంగరూపములో కదలుచు సర్వమును ఆకర్షించి త్రిప్పుచున్నదని సూక్ష్మదృష్టికి గోచరము కాగలదు. కాని స్థూలదృష్టికి ఆకాశము నిశ్చలస్థితిలో నున్నట్లుగా కనిపించును. కొందరు అయస్కాంతము తాను కదులక ఇనుప వస్తువులను ఆకర్షించి, వాటిని కదిలించునని ఉపమానమునిస్తారు. కాని సూక్ష్మముగా విచారిస్తే అయస్కాంతమునందలి అణువులు తామున్నచోటే ఒక వైపు కదులుతూ ఆ ఇనుపవస్తువులను ఆకర్షిస్తాయి తప్ప, అవి కదలకుండ ఏ రకమైన ఇనుపవస్తువులను ఆ అయస్కాంతము ఆకర్షించుటలేదు. కనుక ఆకర్షణజేయుచు, శబ్దగుణకమై వున్న ఆకాశము సూక్ష్మదృష్టికి కదలుచున్నదనియే తీర్మానము. ఆకాశమనునది ఒక పదార్థమేగాని, శూన్యము కాదు కదా? అచట వ్యవహారశూన్యమేగాని, అది వస్తుశూన్యముగానిదని తెలియవలెను.

ఆత్మను విడచి అనాత్మ యగు పదార్థముగాని శక్తిగాని లేదు. ఆత్మానాత్మలు కలిసియే వున్నవి, వాటిని విడదీయలేము. కనుక శుద్ధాత్మ లేదు. మరియూ శుద్ధ శక్తియో, శుద్ధ పదార్థమో లేదు. ఇంకనూ శుద్ధ క్షేత్రమో లేదు. ఆత్మ, పదార్థము, శక్తి, క్షేత్రము అను నాలుగు ఒకదానియందు ఒకటి కలిసియే వున్నవి. ఇదే వస్తులక్షణము. ఎరుకను స్వచ్ఛమైన (శుద్ధమైన) ఆత్మరూపమైన అజడమనియో, స్వచ్ఛమైన పదార్థరూపమైన జడమనియో, అంతటా వ్యాపించి నిండియున్న అచలమనియో, ప్రకృతికి వేరుగా గుణములు లేని ఆత్మ అనియో, నిర్వ్యాపారి అనియో కూడ చెప్పకూడదు. ఎందుకనగా జడాజడములు ఏకమే గనుక. ఆత్మానాత్మలు ఏకరూపమే గనుక. ఆ ఏకరూపమైన ఎరుక అను పదార్థము చలన రూపములో నున్నది. కనుకనే ఎరుకాతీతమైన పరిపూర్ణమునకు “అచలము” అని పేరును పెట్టినారు. శూన్యమనునది ఎరుకకు, అచలపరిపూర్ణబ్రహ్మమునకు మధ్యనున్న సందు. ఆ శూన్యమందున్న ఎరుక శూన్యమే అగును. అనగా జడాజడములు మృష.

భగవద్గీతయందు కూడ జడములైన శస్త్రములను చేతనము గలిగిన వ్యక్తి చేతిలో పట్టుకొని దేనినైతే ఖండించలేడో, అనగా జడాజడములు గలసి దేనినైతే నరుకలేవో అది "అచలపరిపూర్ణబ్రహ్మము" అనియూ, "అచలోయం సనాతనః" అనియూ శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి బోధించెను కదా? కనుక ఇచట ఆత్మ చేతనము, ఫృథ్వ్యాది పంచభూతములతోనైన శస్త్రములు జడమనియూ బోధపడుచున్నది. ఇందులో సంశయాలు ఏమియూ లేవు. ఈ విధానమును ఎవడైతె గురుముఖమున పదార్థ విజ్ఞానము ద్వారా తెలిసికొంటాడో వాడికి జననమరణభ్రాంతి రాహిత్యము కలుగునని భావము.

Written by:
Dr. Sridhar Rapelli, New York, USA.
Date: 12th February 2018.
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to వ్యాస రచనలు

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron