అలమేలు కౌగిలిలో అలరేటి స్వామికి, అందాల చందన నీరాజనం, కలికి సిరి ఒడిలోన కులికేటి స్వామికి, కర్పూర హారతులు నీరాజనం. ||అల|| 1. నిత్య కల్యాణములో నిండారు స్వామికి, నుతి, స్తోత్ర, గీతముల నీరాజనం, సతతము శ్రీ సతి సొంపులు మరగిన, నల్లనయ్యకు నిత్య నీరాజనం. ||అల|| 2. సిరి రమణి లావణ్య సరస సల్లాపముల, సుఖియించు స్వామికి నీరాజనం, సరసిజాసని వాలు సన్నని చూపులలో, చిక్కిన వానికి నీరాజనం. ||అల|| 3. కరి రాజ వరదునికి, కరుణాంతరంగునికి, కొమ్మలు పట్టెడి నీరాజనం. వర వేంకటాపతికి, వనజ హృద్ వాసునికి, విశ్వజనులు పట్టు నీరాజనం. ||అల|| 4. శ్రీకాంత సురతములో సొలసిన స్వామికి, చల్లని వీచికల నీరాజనం, ఏకాంత సేవలో రమాకాంతుడు యిచ్చు, అతిరమ్య పదములు నీరాజనం. ||అల|| రమాకాంతరావు చాకలకొండ February 17, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |